ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లు మొదలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు జోనల్ ఇంఛార్జ్‌‌ల సమావేశంలో‌ చర్చించినట్లు తెలుస్తోంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజును అదే జిల్లా పరిధిలోని ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించినబోతున్నట్లు సమాచారం. నరసాపురం సీటు రఘురామకు ఇచ్చేలా చంద్రబాబు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అందుకే రఘురామను ఉండి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. అక్కడ టీడీపీ తమ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజును పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయనకు నచ్చజెప్పి పోటీ నుంచి విరమింపజేసే బాధ్యతను చంద్రబాబు పార్టీ నేతలకు అప్పగించినట్లు చెబుతున్నారు.

ఇటు అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో కూడా టీడీపీ తమ అభ్యర్థిని మారుస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఇక్కడ అంతకు ముందు ఎన్ఆర్ఐ పైలా ప్రసాదరావుకు సీటిచ్చారు. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో ప్రచారంలో వెనుకబడ్డారని అధినాయకత్వానికి నివేదికలు అందాయి. దీంతో ఆయన్ను మార్చి సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేశారని.. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా మార్చబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంంది. ఆయన ప్రచారంలో వెనుకబడిపోవడం.. ప్రత్యర్థులతో ఆయనకు వ్యాపార సంబంధాలున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నాట్లు చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేశ్‌ సతీమణి సరళారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌, కొండా నరేంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర (ఎస్సీ) నియోజకవర్గంలో.. ప్రస్తుత అభ్యర్థి అనిల్‌ కుమార్‌ను మార్చాలని నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ సీటును పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజుకు ఇవ్వనున్నట్లు సమాచారం. రాజుది అనంతపురం జిల్లా కావడంతో.. లైన్ క్లియర్ చేశారని చెబుతున్నారు.

మరోవైపు ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ స్థానంలో కూడా మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. తమకు ఇచ్చిన అనపర్తి సీటును టీడీపీకి తిరిగి ఇవ్వాలంటే తమకు దెందులూరు ఇవ్వాలని బీజేపీ నాయకత్వం కోరిందని చెబుతున్నారు. . అయితే ఇక్కడ టీడీపీ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ ఒత్తిడితో ప్రభాకర్‌కు నచ్చజెప్పడానికి టీడీపీ నాయకత్వం పార్టీ నేతలను ఆయన వద్దకు పంపినట్లు చర్చ జరుగుతోంది. కానీ ఆయన తప్పుకోవడానికి ఇష్టపడకపోవడంతో.. చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వీటితో పాటుగా మరికొన్ని స్థానాల్లో మార్పులకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కడప జిల్లా కమలాపురం, తిరుపతి జిల్లా వెంకటగిరిలో పార్టీ ఇంఛార్జ్‌లకు బదులు వారి వారసుల్ని అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ రెండు చోట్లా తిరిగి వారి తండ్రులే పోటీకి దిగితే బావుంటుందని అధిష్టానం భావిస్తుందట.. ఈ అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ నాయకత్వం తమ అభ్యర్థులకు బీ ఫారాలను ఈ నెల ఆదివారం 21న పంపిణీ చేయనుంది. తమ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను ఆ రోజున కేంద్ర కార్యాలయానికి పిలిపించి ఇవ్వాలని నిర్ణయించారు. అదే రోజు వారితో ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-19T08:16:51Z dg43tfdfdgfd