ఇద్దరు ఒకే వీధిలో ఉంటారు.. తండ్రి ఏపీలో, కుమారుడు తెలంగాణలో.. ఎలాగంటే!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఓ ఆసక్తికర విషయం తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మార్పుల్లో భాగంగా తండ్రీకొడుకులు ఒకే వీధిలో ఉంటున్నా.. ఇద్దరు వేర్వేరు రాష్ట్రాల పరిధిలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు తండ్రిది ఆంధ్రప్రదేశ్ అయితే.. కుమారుడిది తెలంగాణ. ఒకే వీధిలో ఉంటున్నా సరే ఇద్దరు రాష్ట్రాల వారీగా విడిపోయినట్లు లెక్క. తండ్రీకొడుకుల గురించి ఆరా తీస్తే ఈ ఆసక్తికర విషయం తెలిసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉన్న రాజుపేటలో శీలం శ్రీనివాస్‌ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాజుపేటలో వీధికి ఓవైపు తెలంగాణలోని మహబూబాబాద్‌ లోక్‌సభ.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోక్‌సభ పరిధిలోకి వెళ్లాయి. శీలం శ్రీనివాస్‌ ఇల్లు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు లోక్‌సభ స్థానం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లింది.

ఈ గ్రామం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరు దాదాపుగా 270 కిలో మీటర్ల దూరం ఉంది. శ్రీనివాస్‌ కుమారుడు జానకీరామ్‌ అదే వీధిలో రోడ్డుకు అవతలి వైపు స్థలం కొనుగోలు చేసి.. ఇంటి కోసం బిల్డింగ్ నిర్మించుకుంటున్నారు. దీంతో తండ్రి నివాసం ఏపీలో ఉండగా.. కుమారుడు జానకీరామ్ తెలంగాణలో పరిధిలోకి వెళ్లారు. మొత్తానికి రాష్ట్ర విభజన అనంతరం పరిణామాలు ఇలా తండ్రీకొడుకులు రెండు రాష్ట్రాల పరిధిలోకి వెళ్లేలా చేసింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T05:01:18Z dg43tfdfdgfd