ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు.. పోలీసులకు హైకోర్టు ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు కోర్టులకు వచ్చే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించింది హైకోర్టు. తనపై నమోదైన కేసుల సమాచారాన్ని ఇచ్చేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ నాదెండ్ల మనోహర్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను సకాలంలో ఇవ్వకుండా వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారని డీజీపీ, పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. జనసేన పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌పై నమోదైన కేసుల వివరాలు అందజేయాలని పోలీసులకు సూచించింది. హోంశాఖ జీపీ మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. శనివారం కేసుల సమాచారాన్ని పిటిషనర్‌కు అందజేస్తామన్నారు. విచారణను ఈనెల 22కు వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదు చేసిన కేసుల వివరాలను అందించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, వంగలపూడి అనిత, బోండా ఉమామహేశ్వరరావు, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్‌ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్లు తమపై నమోదైన కేసుల వివరాలను నామినేషన్‌ దాఖలు సమయంలో సమర్పించకపోతే అనర్హత వేటు పడే ప్రమాదం ఉందన్నారు. వాటి కోసం డీజీపీకి వినతి సమర్పించినా ఇప్పటి వరకు స్పందన లేదని తెలిపారు. వెంటనే సమాచారం ఇచ్చేలా ఆదేశించాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసుస్టేషన్లలో తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నెల రోజుల కిందట పిటిషనర్లు డీజీపీకి విజ్ఞప్తి చేశారని గుర్తుచేసింది. ఇవ్వాలనుకుంటే ఒక్కరోజులో అందజేయవచ్చని వ్యాఖ్యానించింది. ఇంతకాలం ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని ప్రశ్నించింది.ఈనెల 16లోపు పిటిషనర్లకు సమాచారం ఇవ్వాలని డీజీపీ, పోలీసులను మౌఖికంగా ఆదేశించింది.

ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల వద్ద సమాచారం ఉంటుందని.. టెక్నాలజీని వినియోగించుకుని రెండు మూడు గంటల్లోనే వాటిని అందజేయవచ్చని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ వివరాలను అందజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టంచేసింది. ఈ మార్గదర్శకాలను పాటించి ఉంటే ఇప్పటికే సమాచారాన్ని తెప్పించి ఉండేవారని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఎస్పీలను వివరాలు కోరకుండా నేరుగా డీజీపీకి వినతి ఇచ్చారని.. అందుకే వారి నుంచి సమాచారం తెప్పించడంలో ఇబ్బంది ఏర్పడిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వరరెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తామన్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T04:47:12Z dg43tfdfdgfd