ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన.. జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం.. ఎందుకంటే?

ఏపీలో ఎన్నికల కోలాహలం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు అందరూ పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ జడ్జి ముందు ప్రమాణం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గజపతినగరం సివిల్ కోర్టులో జడ్జి ముందు.. ప్రమాణం చేశారు. కోర్టులో ఎన్నికల నామినేషన్, అఫిడవిట్ సమర్పించిన అనంతరం.. జడ్జి ముందు ప్రమాణం చేశారు.

అయితే చంద్రబాబు ఇలా జడ్జి ముందు ప్రమాణం చేయడానికి కూడా ఓ కారణం ఉంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కుప్పం నుంచి చంద్రబాబు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక చంద్రబాబు తరుఫున ఆయన సతీమణి కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 19వ తేదీ భారీ ర్యాలీగా వెళ్లి భువనేశ్వరి చంద్రబాబు తరుఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇలా ఒకరి బదులుగా మరొకరు నామినేషన్ దాఖలు చేసిన సమయంలో.. సదరు అభ్యర్థి జడ్జికి నామినేషన్ పత్రాలు సమర్పించి ఆయన ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఈ కారణంతోనే చంద్రబాబు కూడా గజపతినగరం సివిల్ కోర్ట్ జడ్జి ముందు ప్రమాణం చేశారు.

మరోవైపు విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు .. ఇవాళ మరో ముగ్గురు అభ్యర్థులకు బీఫామ్ అందజేశారు. పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, అమర్ నాథ్ రెడ్డిలకు బీఫామ్ అందించారు. చంద్రబాబు ఇటీవలే అభ్యర్థులు అందరికీ బీఫామ్ అందజేయగా.. వివిధ కారణాలతో వీరు ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. దీంతో మంగళవారం వీరికి బీఫారమ్ ఇచ్చారు. మాజీ మంత్రి పరిటాల సునీత మరోసారి రాప్తాడు నుంచి బరిలోకి దిగుతున్నారు. అలాగే ఉరవకొండ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్ మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి పలమనేరు నుంచి బరిలో ఉన్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T09:26:06Z dg43tfdfdgfd