ఏపీ ప్రజలు తెలంగాణ వాళ్లకంటే ఎక్కువ తెలివైన వాళ్లు.. అందుకే హైదరాబాద్‌లో మాకు అన్ని సీట్లు.. కేటీఆర్ అంత మాటన్నారా?

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఎన్నికల కోలాహలం నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటే.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక ఎన్నికల వేళ రాజకీయ నేతలు చేసే ప్రతి మాట.. చాలా ప్రాధాన్యంతో కూడుకుని ఉంటుంది. అందుకే ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు మన పొలిటికల్ లీడర్లు. అయితే ఒక్కొక్కసారి వారు చేసే వ్యాఖ్యలు.. రాజకీయంగా చాలా చర్చకు దారితీస్తాయి. అలాంటి ఘటనే ఈ మధ్య ఒకటి జరిగింది. తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రప్రజలు చాలా తెలివైన వారంటూ కేటీఆర్ అన్నట్లుగా ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను మరో అంశానికి ముడిపెట్టి వైరల్ చేయడం కామన్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజలను అవమానించారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ ప్రజల కంటే ఏపీ ప్రజలు తెలివైన వాళ్లని.. అందుకే హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయని.. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని కేటీఆర్ అన్నట్లుగా వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో కౌంటర్ ఇచ్చే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెర్షన్ కూడా ఉంది. కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని రేవంత్ ఆరోపించారు. అయితే కేటీఆర్ నిజంగానే ఆ మాటలు అన్నారా లేదా గమనిద్దాం.

నిజం ఏంటి?

అసలు నిజం ఏమిటంటే ఏపీ ప్రజలు తెలివైన వాళ్లు అని కేటీఆర్ నిజంగానే అన్నారు. అయితే అన్న సందర్బం వేరు. ఆయన అన్నది తెలంగాణ ఎన్నికలపై కాదు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో కేటీఆర్ ఈ మాటలు అన్నారు. అయితే ఆయన మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తూ కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. టీవీ9లో జరిగిన ఇంటర్వ్యూలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈకేటీఆర్ ఏపీ ప్రజలు తెలివైనవారని అభివర్ణించారు.

ఎలా తెలిసింది?

వైరల్ అవుతున్న వీడియో కోసం యూట్యూబ్‌లో వెతకగా.. ఏప్రిల్ 12, 2024 నాటి టీవి9 ఇంటర్వ్యూ కనిపించింది. ఈ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ఆంధ్రా ప్రజలు తెలంగాణ ప్రజలకన్నా తెలివైన వారు, కాబట్టి వారు సరైన నిర్ణయం తీసుకుంటారు అని కేటీఆర్ సమాధానమిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. తాము తెలంగాణ కోసం పోరాడే సమయంలో ప్రాంతంగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉందామని చెప్పామని.. అదే మాటను పదేళ్లు ఆచరణలో చూపించామని కేటీఆర్ అన్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదనుకున్న హైదరాబాద్‌లో.. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు తమకు ఓటేశారని కేటీఆర్ చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా రాలేదని చెప్పారు. అలాగే రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే తమ ఉద్దేశమన్న కేటీఆర్.. అక్కడి ప్రజలు చాలా తెలివైనవారు. తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైనవారు, చైతన్యవంతులు కావున సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.కేటీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి మీడియాల్లోనూ వార్తలు వచ్చాయి.

తీర్పు

అయితే ఏపీ ఎన్నికలపై కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణకు ముడిపెడుతూ.. కొంతమంది డిజిటల్ ఎడిటింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఒక సందర్బంలో చేసిన వ్యాఖ్యలను మరో అంశానికి ముడిపెడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ వీడియో తప్పుదోవ పట్టించేదిగా మేము నిర్ధారిస్తున్నాము.

(This story was Originally published by Factly and Edited by Samayam Telugu As a Part of Shakti Collective)

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T11:58:25Z dg43tfdfdgfd