ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్!

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకుంటున్నారు. అయితే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగించుకునేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో మరో అవకాశాన్ని ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. ఈ మేరకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఉద్యోగుల ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని ఆర్వో (రిటర్నింగ్‌ అధికారులు)లను ఆదేశించారు. ఓటు వినియోగానికి ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు సైతం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు ఆర్వోలకు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 1 లోపు ఫాం-12 సమర్పించని వారికి.. ఓటరుగా నమోదైన నియోజకవర్గంలోనే ఫారమ్-12 సమర్పించేందుకు, ఫెసిలిటేషన్‌ సెంటర్లో ఓటు వినియోగానికి అవకాశం ఇవ్వాలని సీఈవో ఆదేశించారు. ఓటరు వివరాలు, ఉద్యోగ నియామక పత్రం ధ్రువీకరించుకున్న తర్వాత పోస్టల్‌ బ్యాలట్‌ ఇప్పటికే ఆ ఉద్యోగికి జారీ చేయలేదని నిర్ధారించుకుని ఓటు వేయడానికి అనుమతించాలని సూచించారు. ఆర్వోలు ఆ రెండు రోజులు ఫెసిలిటేషన్‌ సెంటర్లలో అందుబాటులో ఉండాలని కూడా చెప్పారు.

ఈ నెల 7, 8 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటు వేసే వెసులుబాటు కల్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 175 నియోజకవర్గాల్లోనూ దరఖాస్తులు తీసుకుని పోస్టల్‌ బ్యాలట్‌ ఇవ్వాలని ఆర్వోలకు సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించొద్దని, అక్కడికక్కడే ఫారమ్-12ను స్వీకరించి అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని సీఈవో ఆదేశించారు. కొందరు ఉద్యోగులు సకాలంలో దరఖాస్తును సమర్పించలేకపోవడంతో ఓటు వేయలేక పోతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు ముకేశ్‌కుమార్ మీనా. ఉద్యోగులకు మంజూరు చేసిన ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును సద్వినియో గం చేసుకుంటూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లో ఓటు హక్కు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

మరోవైపు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు, ప్రలోభాలను అరికట్టేందుకు పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని సీఈవో మీనా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.450కోట్ల విలువైన నగదు, మద్యం, విలువైన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సున్నిత, అతి సున్నితమైన 12,400 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని.. ఆయా ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. మొత్తం మీద ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T01:00:29Z dg43tfdfdgfd