AP WEATHER: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎండలతో పాటుగా.. మరోవైపు వానలు పడుతున్నాయి. మొన్నటి వరకు ఎండలు, వేడి గాలులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షాలతో ఉపశమనం దక్కింది. ప్రధానంగా ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో వానలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రెండు రోజులు (గురు, శుక్రవారం) పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.

ప్రకాశం, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణశాఖ. చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో వానలకు అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలోని పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరంలో కొన్ని మండలాల్లో వేడి గాలులు వీస్తాయంటున్నారు.

మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటున్నారు. బుధవారం అనంతపురం, ప్రకాశం జిల్లా, తూర్పుగోదావరి, బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ, నంద్యాల జిల్లా, కడప జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 39 ప్రాంతాల్లో భారీ వానలు పడ్డాయి.ప్రకాశం జిల్లా మద్దిపాడులో 130.6 మిమీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 114.2 మిమీ అధిక వర్షపాతం నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో విచిత్రమైన వాతావరణం కనిపించింది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కనిపించగా.. ఆ తర్వాత వాతావరణం మారిపోయింది. అనంతరం ఒక్కసారిగా గంటకుపైగా భారీ వాన పడింది. మొన్నటి వరకు ఎండలతో ఇబ్బందిపడ్డ జనాలు ఈ వర్షాలతో ఉపశమనం పొందారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-09T00:40:34Z dg43tfdfdgfd