చంద్రబాబు కంటే ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులే ఎక్కువ.. 2019తో పోలిస్తే ఆస్తులు అంత పెరిగాయా!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలైంది. ఆయన తరఫున భార్య భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నామినేషన్‌ దాఖలు చేశారు. సెంటిమెంటు ప్రకారం తొలుత కుప్పంలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మసీదు, బాబునగర్‌ చర్చిలో ప్రార్థనలు జరిపారు. కుప్పం చెరువు కట్టపై నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి తహసీల్దారు కార్యాలయానికి వచ్చి రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసులుకు ఒక సెట్‌ నామినేషన్‌ సమర్పించారు. చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్‌ సమర్పించడం ఇదే తొలిసారి. 2014లో ఆయన కుమారుడు లోకేశ్‌ కార్యక్రమానికి రాగా, 2019లో స్థానిక నాయకులే నిర్వహించారు. ఈసారి భువనేశ్వరి వచ్చారు.

చంద్రబాబు తన నామినేషన్‌లో చంద్రబాబు తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. చంద్రబాబు పేరు మీద మొత్తం రూ.36.36 కోట్లు ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తులు రూ.4.80 లక్షలు, వీటిలో ఏపీ9జీ393 నంబరు అంబాసిడర్‌ కారు విలువ రూ.2,22,500.. బంగారం లేదు. స్థిరాస్తులు రూ.36.31 కోట్లున్నాయి. కుమారుడు లోకేశ్‌తో కలిసి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు. ఇది ఒక్కటే చంద్రబాబుకున్న అప్పు.

అలాగే చంద్రబాబు భార్య భువనేశ్వరి ఆస్తులు రూ.895 కోట్లు. వీటిలో చరాస్తులు రూ.810.37 కోట్లు.. ఇందులో హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌లోని 2,26,11,525 షేర్ల విలువ రూ.763.93 కోట్లు. బంగారం, ఇతర ఆభరణాలు కలిపి రూ.1.40 కోట్లు. స్థిరాస్తులు రూ.85.10 కోట్లు కాగా.. అప్పులు రూ.6.83 కోట్లు. ఇందులో కుమారుడు లోకేశ్‌ నుంచి రూ.1.27 కోట్లు తీసుకోవడం విశేషం. ఆదాయపన్ను శాఖ నుంచి రూ.6,04,900 డిమాండ్‌ నోటీసుపై వివాదం ఉంది.. భువనేశ్వరి పేరుపై కారు లేదు.

చంద్రబాబుపై కేసులు వివరాలు ఇలా ఉన్నాయి. 2019కు ముందు ఆయనపై కేవలం రెండు కేసులుండగా.. ఈ ఐదేళ్లలో ఏకంగా 22 కేసులు పెట్టారు. వాటిలో మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో పెట్టిన కేసులే ఏకంగా 8 ఉన్నాయి. చంద్రబాబుపై అన్నమయ్య, తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రెండేసి చొప్పున, అనంతపురం, గుంటూరు, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖ, నంద్యాల జిల్లాలతోపాటు మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కేసులున్నాయి. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి శుక్రవారం నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన ప్రమాణపత్రంలో ఈ వివరాలున్నాయి.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో చంద్రబాబుపై రెండు కేసులు నమోదు చేశారు. కురబలకోట మండలం అంగళ్లులో గతేడాది ఆగస్టులో తెదేపా కార్యకర్తలను వైకాపా శ్రేణులు రెచ్చగొట్టినప్పటికీ తిరిగి ప్రతిపక్ష పార్టీపైనే కేసులు పెట్టారు. చంద్రబాబు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఎఫ్‌ఐఆర్‌ కట్టారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో విజయసాయిరెడ్డి వాహనంపై తెదేపా శ్రేణులు రాళ్లు, నీళ్ల సీసాలు, చెప్పులు విసిరి అద్దాలు పగలగొట్టి చంపబోయారంటూ మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

చంద్రబాబుపై 2010లో మహారాష్ట్ర బ్లీ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ధర్మాబాద్‌ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. 2012లో ఆళ్లగడ్డ ఉప ఎన్నిక సందర్భంగా.. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారని కేసు పెట్టారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక 2020లో 5, 2021లో 9, 2022లో 2, 2023లో 6 కేసులు పెట్టారు. వాటిలో మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో 2023లో రెండు, 2022లో ఒకటి, 2021లో మూడు, 2020లో రెండు మొత్తం 8 కేసులు నమోదయ్యాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T00:32:08Z dg43tfdfdgfd