జనం చూస్తున్నారనే సోయి కూడా లేకుండా.. నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు (వీడియో)

Police Constables Fighting at Anantapur: పోలీసులు అంటే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన వ్యక్తులు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా మేమున్నామంటూ అండగా నిలిచేది ఖాకీలే. కొంత మంది పోలీసుల కారణంగా అప్పుడప్పడూ ఆ శాఖపై విమర్శలు వస్తూ ఉంటాయి. అలాంటి ఘటనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగింది. ఇద్దరు పోలీసులు సహనం కోల్పోయి పట్టపగలు, నడిరోడ్డుపై తన్నుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు వివరాల్లోకి వెళ్తే.. సత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జనం చూస్తున్నారనే స్పృహ లేకుండా నడి రోడ్డు మీద ఫైటింగ్ చేశారు. ఈ ఘటన పిల్లిగుండ్లు చెక్ పోస్ట్ వద్ద జరిగింది. రొళ్ల పోలీస్ స్టేషన్‌కు చెందిన శివకుమార్, అగళి పోలీస్ స్టేషన్‌కు చెందిన నారాయణస్వామి నాయక్ అనే కానిస్టేబుళ్లకు పిల్లిగుండ్లు చెక్ పోస్ట్ వద్ద విధులు కేటాయించారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాలను తనిఖీ చేసేందుకు వీరిద్దరినీ అక్కడ నియమించారు. అయితే విధుల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఈ కానిస్టేబుళ్లు ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. రోడ్డు మీదే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.

సాయంత్రం డ్యూటీ మారే సమయంలో ఆలస్యమైందని ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. అది మాటామాటా పెరిగి చివరకు ఘర్షణకు దారి తీసింది. చుట్టూ జనం చూస్తున్నారనే విషయం కూడా మరిచిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది. అయితే కానిస్టేబుళ్లు పరస్పరం దాడి చేసుకుంటున్న దృశ్యాలను అటుగా వెళ్తున్న జనం తమ కెమెరాల్లో బంధించారు. సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. పోలీసులే ఇలా నడిరోడ్డుపై దాడి చేసుకుంటే ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎవరైనా గొడవపడితే.. సర్ది చెప్పే పోలీసులు ఇలా గొడవ పడటం సరికాదంటున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T09:16:48Z dg43tfdfdgfd