టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో కీలక పరిణామం జరిగింది. తెలుగు దేశం పార్టీకి ఊరటనిస్తూ రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నారు.. తమ నామినేషన్లను వెనక్కు తీసుకుంటున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్‌ను మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వెనక్కు తీసుకున్నారు. తన అనుచరుడితో విత్‍డ్రా ఫామ్‍పై సంతకం చేసి ముద్దరబోయిన పంపించారు. అలాగే ముద్దరబోయిన కుటుంబ సభ్యులు కూడా తమ నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథికి భారీ ఊరట లభించింది. చంద్రబాబును కలిసి ముద్దరబోయిన మళ్లీ తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు.

ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అయితే ఆయన మరోసారి తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు.. ఇంతలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి టీడీపీ నూజివీటు టికెట్ కేటాయించింది. దీంతో ముద్దరబోయిన టీడీపీకి రాజీనామా చేశారు.. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. దీంతో ముద్దరబోయిన వైఎస్సార్‌సీపీలో చేరతారని చర్చ జరిగింది. అయితే ఆయన మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు.

మార్చి నెల నుంచే ముద్దరబోయిన ప్రజల్లోకి వెళుతున్నారు.. ప్రతి గ్రామంలో పర్యటించారు. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ముద్దరబోయినను టీడీపీ నేతలు బుజ్జగించారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ కుమార్, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో పాటూ నేతలు ముద్దరబోయినకు సర్థి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడించడంతో మెత్తబడ్డారు.. నామినేషన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు. దీంతో ముద్దరబోయిన, కొలుసు పార్థసారిథి కలిసి పనిచేయబోతున్నారు.

మరోవైపు అనకాపల్లి జిల్లా మాడుగుల తెలుగుదేశం రెబల్ అభ్యర్థి పైలా ప్రసాద్ కూడా తన నామినేషన్‌ను వెనక్కు తీసుకున్నారు. వాస్తవానికి పైలా ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింి.. కానీ అనూహ్య పరిణామాలతో చివరి నిమిషంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల టికెట్ కేటాయించారు. దీంతో పైలా ప్రసాద్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా మారారు.. పోటీలో ఉంటానని ప్రకటించారు. కానీ ఆయన నామినేషన్ విషయంలో వెనక్కు తగ్గారు.. నామినేషన్‌ను వెనక్కు తీసుకున్నారు. మాడుగులలో బండారు సత్యనారాయణ మూర్తిగెలుపు కోసం కృషి చేస్తానని.. భారీ మెజారిటీ రావడానికి ఎన్నికల వరకు సైనికుడిలా పని చేస్తానని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో కూటమి అభ్యర్థులు గెలుపు ఒక్కటే ఇప్పుడు తమ లక్షమన్నారు. మరికొన్ని స్థానాల్లో కూడా టీడీపీకి రెబల్ అభ్యర్థుల పంచాయితీ ఉంది.. వారిలో ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారన్నది చూడాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-29T08:04:13Z dg43tfdfdgfd