తిరుమల తరహాలో తిరుపతిలోనూ ఉచితంగా నిత్యాన్నదానం.. ఎక్కడెక్కడంటే?

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకుంటూ ఉంటారు. నడక మార్గంలో కొంతమంది, బస్సులో మరికొంత మంది, ఇక ప్రైవేట్ వాహనాల ద్వారా ఇంకొందరు తిరమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకునే భక్తులు.. స్వామివారిని క్షణకాలం పాటు దర్శించుకుని తరిస్తూ ఉంటారు. వెంకన్న దర్శనం తర్వాత శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించి.. స్వామి వారి కృపకు పాత్రులవుతూఉంటారు. తిరుమలలో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఉచితంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం గత కొన్నేళ్లుగా నిర్విఘ్నంగా జరుగుతూ వస్తోంది.

అయితే భక్తులకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే శ్రీవారు కొలువైన తిరుమలతో పాటుగా.. శ్రీనివాసుడి పాదాల చెంత ఉన్న తిరుపతిలోనూ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. తిరుమలను దర్శించుకునే భక్తులు.. తిరుపతిలోని దర్శనీయ ప్రాంతాలను కూడా సందర్శిస్తూ ఉంటారు. వారి కోసం.. పలుచోట్ల టీటీడీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, పాత అన్న ప్రసాద భవనం,పీఎసీ 2 భవనంలో అన్న ప్రసాద పంపిణీ జరుగుతూ ఉంటుంది.

అలాగే తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. తిరుపతి నగరంలోని పలు సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లే భక్తులు వారికి సమీపంలో ఈ కేంద్రాలు ఉంటే అన్పప్రసాదాన్ని స్వీకరించవచ్చు.

మరోవైపు మే12వ తేదీ తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో పుష్పయాగం జరగనుంది . మే 11వ తేదీన సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ జ‌రుగ‌నుంది. పుష్పయాగంలో భాగంగా ఉదయం పదిగంటల నుంచి 11 గంటల వరకూ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత్రి ఏడు గంటలకు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు. పుష్పయాగంలో పాల్గొనాలనుకునేవారు వేయి రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T09:50:11Z dg43tfdfdgfd