TTD: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ ఒక్క రోజు దర్శన సమయం మార్పు, ఈ విషయం తెలుసా!

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 9న ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని ఏప్రిల్‌ 2వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీ.

ఏప్రిల్‌ 2న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆల‌యాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు.

శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అంటే ఆ రోజు (ఏప్రిల్ 2న) 11 గంటల తర్వాత నుంచి భక్తుల్ని దర్శనం కోసం అనుమతిస్తుంది టీటీడీ.

ఏప్రిల్ 4 నుంచి 8వ తేదీ వరకు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతి ఉత్సవాలు

శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 521వ వ‌ర్థంతి ఉత్సవాలు ఏప్రిల్ 4 నుంచి 8వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది.

ఏప్రిల్ 5న తిరుమలలో సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో స‌ప్త‌గిరి సంకీర్త‌నా గోష్ఠిగానం నిర్వహిస్తారు. ఏప్రిల్ 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తిరుమల నడకదారిలో చిరుత కలకలం

అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. అటవీ శాఖ అమర్చిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుత సంచారాన్ని గుర్తించినట్లు చెప్పారు. బాలిక లక్షితపై దాడి జరిగిన అనంతరం ఇప్పటికే ఆరు చిరుతలను బోన్లలో బంధించి, వివిధ ప్రాంతాల్లో విడిచిపెట్టారు. వాటిలో నాలుగోసారి పట్టుబడిన చిరుత చిన్నారిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో చిరుత సంచారం కనిపించడంతో టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులను గుంపులుగా పంపడం, వారికి చేతికర్రలు అందించడంతో పాటు ఆ మార్గంలో సిబ్బందిని ఉంచినట్లు డీఎఫ్‌వో వివరించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-29T00:26:21Z dg43tfdfdgfd