నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు ఎదురు దెబ్బ.. వైసీపీకి ముఖ్య నేతల రాజీనామా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కొన్ని నియోజకవర్గాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీ మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్‌సీపీకి ముఖ్య నేతలు గుడ్ బై చెప్పారు.. వారిలో శ్రీశైలం దేవస్థానం మాజీ ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రెడ్డివారి భాస్కర్‌రెడ్డి, లక్ష్మీపతిరాజు, ఆరుగురు సర్పంచులు, డీసీసీబీ మాజీ డైరెక్టర్లు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు.

మంత్రి రోజా తమను పట్టించుకోలేదని.. తమకు పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని నేతలు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తమను దూరంగా పెట్టారని.. ఎన్నోసార్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజాకు టికెట్‌ ఇస్తే ఓడిపోతారని ముందే చెప్పామని గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో మంత్రి రోజా సోదరుల పెత్తనం ఎక్కువైందని.. స్థానిక ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా అవినీతి, అక్రమాలకు రోజా కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలిచారని ఘాటుగా విమర్శించారు.

తామంతా తీవ్ర ఆవేదనతో ఐదు మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కోసం మొదటి నుంచి ఎంత కష్టపడినా గుర్తింపు, ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏపీఐఐసీ భూముల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు వడమాలపేట టోల్‌ గేట్‌ వద్ద స్థలాలను రోజా కబ్జా చేయడాన్ని ప్రశ్నించినందుకే తమపై కక్ష కట్టారని నేతలు చెప్పుకొచ్చారు. నగరిలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌లోనూ రోజా కమీషన్లు దండుకున్నారని.. తామంతా త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు నేతలు ప్రకటించారు.

నగరిలో మంత్రి రోజాను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు రెడ్డివారి చక్రపాణి రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు రోజా చేసిన అవినీతిపై కాణిపాకంలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని.. రోజాను నగరి నుంచి తరిమేయకుంటే ప్రజలు ప్రశాంతంగా బతికే అవకాశం లేదని ధ్వజమెత్తారు. మంత్రి రోజా వైఖరి నచ్చక తాము పార్టీని వీడాల్సి వస్తుందన్నారు.. ఐరన్ లెగ్‌గా ఉన్న రోజా.. ఇప్పుడు తమ వల్లె గోల్డన్ లెగ్ అయ్యిందన్నారు.

ఎన్నికల సమయంలో ఒక్కసారిగా ఇంతమంది నేతలు పార్టీని వీడటం రోజాకు ఎదురు దెబ్బే అంటున్నారు. మరోవైపు మొదలియార్‌ వర్గానికి చెందిన నాయకుడు, మాజీ ఎంపీపీ ఏలుమలై ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఆయన పుత్తూరు, నగరిలో పర్యటించి మంత్రి అవినీతి, అక్రమాలు చేశారంటూ ప్రచారం చేస్తున్నారు. ఆయన వెంట ఉన్న క్షత్రియ సామాజికవర్గ నాయకులు కూడా వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T02:07:57Z dg43tfdfdgfd