నెల వ్యవధిలో రెండుసార్లు.. తనిఖీ చేసిన పోలీసులకే షాక్.. కళ్లు జిగేల్

17 crore worth gold seized in Pithapuram: ఎన్నికల వేళ ఏపీలో అధికారులు తనిఖీలు ముమ్మురం చేశారు. పోలీసులతో పాటుగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌లు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పలుచోట్ల భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీగా బంగారం, వెండి నగలు పట్టుబడ్డాయి. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఓ మినీవ్యానులో రూ. 17 కోట్ల విలువైన బంగారం, వెండి నగలను తరలిస్తున్నట్లు గుర్తించారు.తరలిస్తున్న బంగారం, వెండి అభరణాలకు సంబంధించి సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో సీజ్ చేసి కాకినాడలోని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి తరలించారు.

ఈ మినీవ్యాన్ విశాఖపట్నం నుంచి కాకినాడకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ అభరణాలను కాకినాడలోని జ్యువెలరీ షాపులకు తరలిస్తున్నట్లు తెలిసింది. అయితే నగలకు సంబంధించి పత్రాలు చూపకపోవటంతో 17 కోట్ల విలువైన ఈ ఆభరణాలను పిఠాపురం పోలీసులు సీజ్ చేశారు. అనంతరం కాకినాడలోని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి సీజ్ చేసిన ఈ నగలను తరలించారు. అయితే ఇదే వాహనం ఇంతకుముందు కూడా తనిఖీల సమయంలో పట్టుబడింది. ఏప్రిల్ 13వ తేదీన పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇదే వాహనంలో మూడుకోట్ల విలువైన బంగారాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇప్పుడు మరోసారి 17 కోట్ల విలువైన బంగారు, వెండి నగలతో దొరకడం సంచలనం రేపుతోంది.

మరోవైపు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి తరుఫున పవన్ కళ్యాణ్ పోటీచేస్తుండగా.. వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. సెలబ్రిటీ నియోజకవర్గం కావటం.. అన్ని పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఈ నియోజకవర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం అధికారులు కూడా ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో పిఠాపురం నియోజకవర్గంలోని పలుచోట్ల భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T09:54:14Z dg43tfdfdgfd