పున్నమి వెలుగుల్లో వైభవంగా ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం.. భారీగా తరలి వచ్చిన భక్త జనం

కడప ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. టీటీడీ ఆధ్యర్యంలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్‌ వలవన్‌ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. టీటీడీ తరఫున కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి రూ.31 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అందజేశారు.

టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ పర్యవేక్షణలో పరిణయ ఘట్టం నయనానందకరంగా సాగింది. ప్రధాన వేదికను ఫల, పుష్ప, పత్రాలతో మనోహరంగా తీర్చిదిద్దారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ముత్యాల తలంబ్రాలు, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు రామయ్య క్షేత్రం నుంచి కళ్యాణ వేదిక వరకు కనులపండువగా శోభాయాత్ర సాగింది. కళ్యాణం వీక్షించే భక్తులకు శ్రీవారి లడ్డు ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు గ్యాలారీల్లోనే అందజేశారు. కళ్యాణ వేదికకు ఇరువైపులా దాదాపు 150 కౌంటర్లలో శ్రీవారి సేవకుల సహకారంతో అన్నప్రసాదాలు కళ్యాణం తరువాత పంపిణీ చేశారు.

అంతకముందు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో శ్రీ కోదండ రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T03:55:17Z dg43tfdfdgfd