పవన్ కళ్యాణ్ పిల్లలిద్దరూ ఇండియన్స్ కాదా..? OCIకి, భారత పౌరులకు తేడా ఏంటి..?

పిఠాపురం నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ సమర్పించారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం జనసేనాని ఆస్తులు రూ.164.5 కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో ఆయనకు రూ.46.7 కోట్ల మేర అప్పులు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ దగ్గర పది కార్లు.. ఓ స్పోర్ట్స్ బైక్ ఉండటం గమనార్హం. తాను పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని జనసేన అధినేత వెల్లడించారు.

ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే.. తనపై నలుగురు పిల్లలు ఆధారపడి ఉన్నారని పవన్ కళ్యాణ్ అఫిడవిట్లో పేర్కొన్నారు. దేశాయ్ అకీరా నందన్, దేశాయ్ ఆద్య.. ఇద్దరూ రేణు దేశాయ్ పిల్లలు అనే సంగతి తెలిసిందే. వారిద్దరూ తల్లి ఇంటి పేరును తమ పేరు ముందు ఉంచుకోవడం గమనార్హం.

ఇద్దరు పిల్లలు ఓవర్సీస్ సిటిజన్లు..

అన్నా లెజినోవా, పవన్ కళ్యాణ్ దంపతులకు ఇద్దరు పిల్లలు అనే సంగతి తెలిసిందే. కొణిదెల పొలినా అండ్‌ఝానీ, కొణిదెల మార్క్ శంకర్ ఇద్దరూ ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) అని జనసేనాని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా రష్యన్ అనే సంగతి తెలిసిందే. దంపతుల్లో ఒకరు భారతీయులై, మరొకరు విదేశీయులు అయినప్పుడు.. వారికి పుట్టిన పిల్లలను ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా గుర్తిస్తారు. ఓవర్సీస్ సిటిజన్లు ఇండియాలో నిర్దిష్ట కాలం ఉంటే.. భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

OCI ఏమేం చేయొచ్చు.. ఏం చేయలేరు..

ఓవర్సీస్ సిటిజన్‌గా గుర్తింపు పొందిన వారికి లైఫ్ లాంగ్ వీసా ఇస్తారు. ఎన్నారైల తరహాలోనే వీరు కూడా మన దేశంలో ఆర్థిక, విద్యా రంగాలకు సంబంధించిన సదుపాయాలు పొందొచ్చు. అయితే ఓవర్సీస్ సిటిజన్లకు ఓటు హక్కు ఉండదు. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కోర్టు జడ్జిల్లాంటి రాజ్యాంగ బద్ధమైన పదవులను వారు పొందలేరు. అలాగే మన దేశంలో వ్యవసాయ భూములను, ప్లాంటేషన్ ఆస్తులను వీరు కొనుగోలు చేయలేరు.

పవన్ సంపాదన ఇలా..

ఇక పవన్ కళ్యాణ్ సంపాదన విషయానికి వస్తే.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తనకు రూ.1.10 కోట్లు నష్టపోయానని జనసేనాని వెల్లడించారు. ఎన్నికల ముందు ఆర్థిక సంవత్సరంలో పవన్‌కు ఆదాయమేమీ లేదన్నమాట. 2019-20లో రూ.4.51 కోట్లు సంపాదించిన పవన్.. 2020-21లో రూ.12.86 కోట్లు సంపాదించారు. 2021-22లో అత్యధికంగా రూ.30 కోట్లు సంపాదించిన పవర్ స్టార్.. 2022-23లో రూ.12.20 కోట్లు సంపాదించారు. పవన్ దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే 9 కార్లు, ఒక పికప్ ట్రక్, హార్లీ డేవిడ్సన్ బైక్ ఉండగా.. అందులో రెండు కార్లు, బైక్ మినహా మిగతా వెహికల్స్ అన్నీ 2021, 2022ల్లో కొనుగోలు చేసినవే కావడం గమనార్హం.

వాహనాలివే..

బెంజ్ మెబాచ్, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, టయోటా వెల్‌ఫైర్, జీప్ - వ్రాంగ్లర్, రెండు మహీంద్రా స్కార్పియో ఎస్ 11 కార్లు పవన్ దగ్గరున్నాయి. పవన్ కళ్యాణ్ దగ్గర 2011 నుంచి బెంజ్- ఆర్ క్లాస్ 350 మోడల్ కారు ఉంది. 2014లో ఆయన మహీంద్రా స్కార్పియో ఎస్ 8 వాహనాన్ని కొనుగోలు చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T01:43:22Z dg43tfdfdgfd