పోస్టల్ బ్యాలెట్ పోలింగ్.. ఎన్నికల సంఘం కీలక సూచనలు

ఏపీ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదలైపోయింది. హోం ఓటింగ్ ద్వారా కూడా కొంతమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో అక్కడక్కడా అవాంతరాలు ఎదురౌతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా.. పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 70శాతం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పూర్తైందని ముకేష్ కుమార్ మీనా తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం మొత్తం 4.30లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పుటి వరకూ 3.30లక్షల మంది వినియోగించుకున్నారని తెలిపారు.

మరోవైపు ఉద్యోగులు వారి సొంత నియోజకవర్గాల్లోనే పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాలని ముకేష్ కుమార్ మీనా సూచించారు. అవసరం అనుకుంటే మే 9 వతేదీ కూడా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయని ఉద్యోగులు.. బుధవారం ఓటు వేయవచ్చని అన్నారు .సెక్యూరిటీ డ్యూటీకి వెళ్లిన వారికి ఈనెల 9న కూడా అవకాశం కల్పించామని ముకేష్ కుమార్ మీనా వివరించారు. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం కొన్నిచోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందన్న మాట వాస్తవమని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి అంగీకరించారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వచ్చే ఉద్యోగులను ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ప్రలోభపెడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ముకేష్ కుమార్ మీనా చెప్పారు. డిజిటల్ పేమెంట్ ద్వారా వారిని ప్రలోభాలకు గురిచేస్తున్న వైనం తమ దృష్టికి వచ్చిందని... దీనిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని.. నిబంధనలను ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మరోవైపు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ఆపాలని ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. కొంతకాలం తర్వాత ఇవ్వాలని మాత్రమే చెప్పిందని అన్నారు. కొన్ని పథకాలకు నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు కోరిందన్న ముకేష్ కుమార్ మీనా.. దీనికి సంబంధించి ఆయా శాఖలను వివరణ కోరినట్లు చెప్పారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T13:50:54Z dg43tfdfdgfd