ప్రకాశం జిల్లా తీర్పు విభిన్నం.. 12 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు?, ఈసారి ఎలా!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా కీలకమైనది.. కోస్తా ప్రాంతంలో వెనుకబడిన జిల్లా ప్రకాశం. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతం ఇప్పటికీ అభివృద్ధిలో వెనుకబడి ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తైతే ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు వస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ జిల్లాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో ప్రాధాన్యం ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ స్థానం ఉంది. ఈ జిల్లాలో ప్రజల తీర్పు ఎప్పుడూ విభిన్నంగా ఉంటుందని చెబుతుంటారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 లోక్ సభ నియోజకవరం ఉంటే.. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఆరు స్థానాల్లో గెలిచింది.. టీడీపీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది.. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. చీరాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో త్రిముఖ పోరు కాగా.. వైఎస్సార్‌సీపీ 8 స్థానాల్లో గెలవగా.. టీడీపీ నాలుగు స్థానాలకు పరిమితమైంది.

ప్రకాశం జిల్లా పరిధిలో ఒంగోలు లోక్‌సభ స్థానం

ఒంగోలు లోక్‌సభ స్థానం ఒక్కటే ప్రకాశం జిల్లా పరిధిలో ఉంది. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో విచిత్రంగా 2019లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసి గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీటీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. వైఎస్సార్సీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఈయన 2019 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు), కాంగ్రెస్ నుంచి ఈద సుధాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా.. అవి చీరాల, పర్చూరు, ఒంగోలు, సంతనూతలపాడు, అద్దంకి, దర్శి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, కందుకూరు, కొండేపి. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తోంది. ఈసారి జిల్లాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని అటు ఇటు మార్పులు చేసింది. టీడీపీ అదే నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లకే టికెట్లు కేటాయించింది.. ఒక్క దర్శి నియోజకవర్గంలో మాత్రమే కొత్తవారికి అవకాశం కల్పించింది.

ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీ చాలా మార్పులు, చేర్పులు చేసింది. యర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కొండేపి నియోజకవర్గానికి పంపి అక్కడ నుంచి పోటీ చేయిస్తోంది. సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును కూడా మార్చేసి.. ఆయన స్థానంలో పొరుగున ఉన్న బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మేరుగు నాగార్జునను పోటీ చేయిస్తున్నారు. గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం నుంచి పోటీ చేయిస్తుండగా.. మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గిద్దలూరు నుంచి పోటీ చేస్తున్నారు.

కందుకూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని కాదని.. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌ను వైఎస్సార్‌సీపీ పోటీకి దింపింది. దర్శిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ బదులు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పోటీ చేయిస్తున్నారు. పర్చూరులో కూడా చీరాలకు చెందిన యడం బాలాజీకి అవకాశం ఇచ్చారు. కనిగిరిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బదులు దద్దాల నారాయణ యాదవ్‌‌ను పోటీ చేయిస్తోంది. యర్రగొండపాలెంలో మంత్రి సురేష్ స్థానంలో తాటిపర్తి చంద్రశేఖర్‌ను బరిలోకి దింపారు. అద్దంకి నియోజకవర్గంలో కూడా హనిమిరెడ్డిని కొత్త అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు.

తెలుగు దేశం పార్టీ నుంచి ఒక్క స్థానం మినహా అన్ని చోట్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పాత ఇంఛార్జ్‌లే పోటీ చేస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో కొత్తగా గొట్టిపాటి లక్ష్మిని టీడీపీ పోటీ చేయిస్తోంది.. ఆమెకు రాజకీయాలు కొత్త.. అయితే ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. లక్ష్మి తండ్రి గొట్టిపాటి నరసయ్య గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె బాబాయి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. లక్ష్మి భర్త, మామలు నరసరావుపేట, పల్నాడు జిల్లాలో రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు దర్శిలో అవకాశం కల్పించింది టీడీపీ.

ఆంధ్రప్రదేశ్‌లో శాసన సభ, లోక్ సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలను వెల్లడించనున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T08:24:07Z dg43tfdfdgfd