సింహాచలం చందనోత్సవానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ దర్శనాలు ఉండవు, ఈ విషయాలు తెలుసుకోండి

సింహాచలంలో చందనోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గతంలో చందనోత్సవ సమయంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్నిజాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ. ఈసారి సామాన్య భక్తులందరికీ సులువుగా అప్పన్న నిజరూప దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సింహాచలంలో ఈసారి భక్తులంతా నీలాద్రి ద్వారం నుంచే నిజరూప దర్శనం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 10న చందనోత్సవం రోజున.. వేకువజామున 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్య అంతరాలయ దర్శనం ఉంటుందంటున్నారు. అది కూడా ఆలయ అనువంశిక ధర్మకర్త, దాతలు, న్యాయమూర్తులకు మాత్రమే ఈ దర్శనం ఉంటుందని తెలిపారు.

రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో ప్రొటోకాల్‌ దర్శనాలకు అనుమతి లేదన్నారు. అలాగే చందనోత్సవం రోజు 6.5 కిలోమీటర్ల మేర 29,500 మంది భక్తులు వేచి ఉండేలా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6గంటల తర్వాత భక్తులకు అప్పన్న దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ నెల 10న తిరిగి దర్శనాలు ప్రారంభమవుతాయి.. ఆ రోజు వేకువజామున ఒంటి గంట తర్వాత దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే కొండపైకి అనుమతిస్తామని తెలిపారు అధికారులు.

అలాగే సింహాచలంలో సంస్థల సహకారంతో భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామన్నారు. ఎండలు, వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సింహాచలం కొండపై, కిందికి భక్తుల రాకపోకలకు మొత్తం 40పెద్ద బస్సులు, 40 మినీ బస్సులు 15 కార్లు వంటి వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దర్శనానికి వచ్చే ప్రముఖులు, భక్తులు ఎవరైనా సరే దేవస్థానం బస్సుల ద్వారానే రావాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు కొండపైకి రావడానికి వెళ్లడానికి వేర్వే మార్గాలను సిద్ధం చేస్తున్నారు.

భక్తులు తొలిపావంచా వైపు నుంచి కొండపైకి వచ్చేందుకు అనుమతిస్తామన్నారు అధికారులు. తిరిగి వెళ్లేటప్పుడు రెండో ఘాట్ రోడ్డు ద్వారా పంపిస్తామని తెలిపారు. పాత గోశాల దగ్గర పార్కింగ్‌ చేసిన వాహనాల దగ్గరకు భక్తులను బస్సుల్లో చేరవేస్తామని చెబుతున్నారు. అంతేకాదు 2500 మంది సివిల్‌ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రోప్ పార్టీతో పాటుగా నాలుగు ప్లటూన్ల సిబ్బంది కూడా అందుబాటులో ఉంటోంది. చందనోత్సవం రోజు భక్తులంతా ఒకేసారి సింహగిరిపైకి చేరుకోకుండా రద్దీని బట్టి విడతల వారీగా హోల్డింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా కృష్ణాపురం గోశాల, సింహాచలం బస్‌స్టాండు, శ్రీనివాసనగర్‌, పాత అడివివరం ప్రాంతాల్లో దగ్గర భక్తులను నిలిపి ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు చందనోత్సవానికి సంబంధించి భక్తులు టికెట్లపై సూచించిన టైం స్లాట్‌కు ఓ రెండు గంటల ముందు వస్తే సరిపోతుందంటున్నారు. ఈసారి వాహనాల పాసులు కూడా పరిమితం చేశారు. భక్తులు కొండ దిగువన సూచించిన ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్‌ చేసి దేవస్థానం వాహనాల్లో మాత్రమే పైకి రావాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3గంటల నుంచి 4గంటల మధ్య దేవస్థానం ఉద్యోగులకు, సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు దివ్యాంగులకు స్వామివారి దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T01:56:53Z dg43tfdfdgfd