25వేల టీచర్ల​ నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు

25వేల టీచర్ల​ నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు

కోల్​కతా:  బెంగాల్​ రాజకీయాలను కుదిపేసిన టీచర్​ రిక్రూట్​మెంట్​ కుంభకోణం కేసులో మమతా బెనర్జీ సర్కారుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్​ లెవల్​ సెలెక్షన్​ టెస్ట్​ (ఎస్ఎల్ఎస్​టీ) చట్టబద్ధం కాదని జస్టిస్​ దేబాంగ్సు బాసక్, జస్టిస్ ఎండీ షబ్బార్​రషీదిలతోకూడిన బెంచ్​ తీర్పు చెప్పింది. 

ఎస్ఎల్ఎస్​టీ 2016  ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ రద్దు చేయాలని, దీని కింద ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్​టీచింగ్​ సిబ్బంది తాము తీసుకున్న జీతాలను 4 వారాల్లో వడ్డీతో సహా తిరిగిచ్చేయాలని ఆదేశించింది.  కొత్త రిక్రూట్​మెంట్​ చేపట్టాలని ​బెంగాల్​ స్కూల్​ సర్వీస్​ కమిషన్​(ఎస్ఎస్​సీ)కి ఆదేశాలు జారీచేసింది. నియామక ప్రక్రియపై తదుపరి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. కాగా, ఈ ఉత్తర్వుపై స్టే విధించాలని కొంతమంది చేసుకున్న అభ్యర్థనను బెంచ్​ తిరస్కరించింది. 

రిక్రూట్​మెంట్​లో అవకతవకలపై పిటిషన్లు

ప్రభుత్వ, ఎయిడెడ్​ స్కూళ్లలో 9 నుంచి 12 వ తరగతులకు ఉపాధ్యాయులు, గ్రూప్​ సీ, గ్రూప్​ డీ ఉద్యోగాల భర్తీకి బెంగాల్​ సర్కారు 2016లో ఎస్ఎల్ఎస్​టీ ద్వారా నియామక పరీక్ష నిర్వహించింది. మొత్తం 24,640 ఖాళీలుండగా, 23 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో సెలెక్షన్​ ప్రాసెస్​ నిర్వహించి 25,753 మందికి అపాయింట్​మెంట్ లెటర్లు ఇచ్చారు. కాగా, ఈ రిక్రూట్​మెంట్​ టెస్ట్​లో అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. 

 క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్లపై విచారణకు డివిజన్​ బెంచ్​ ఏర్పాటైంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన బెంచ్​.. చివరకు 2016 టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, అది చెల్లదని తీర్పుచెప్పింది. ఈ రిక్రూట్​మెంట్​లో ఉద్యోగాలు పొందిన టీచింగ్​, నాన్​ టీచింగ్​ సిబ్బంది జీతాల రికవరీ బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. 

ఉద్యోగాల రద్దు చట్టవిరుద్ధం: సీఎం మమతా బెనర్జీ

బెంగాల్​లో 2016 టీచర్​ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీచేసిన ఉద్యోగాలను రద్దు చేస్తూ కోల్​కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఉద్యోగాల రద్దు చట్ట విరుద్ధమన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్​ చేస్తామని చెప్పారు. నార్త్​ బెంగాల్​లోని రాయ్​గంజ్, కరన్​డిఘి​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె, మాట్లాడారు.  కొన్ని న్యాయ నిర్ణయాలను బీజేపీ నేతలు ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని, తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ‘అన్ని తీర్పులను అంగీకరించడం తప్పనిసరేం కాదు. హైకోర్టు ఆర్డర్స్​ను సుప్రీంకోర్టులో సవాల్​ చేస్తాం’ అని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

    ©️ VIL Media Pvt Ltd.

2024-04-23T05:09:48Z dg43tfdfdgfd