72ఏళ్ల రికార్డ్ బద్దలు.. ఇక్కడ తొలిసారి మహిళా అభ్యర్థి పోటీ !

ఒకప్పుడు మహిళలను వంటింటికే పరిమితం చేసిన రోజులు మనకు తెలుసు. అలాంటిది ప్రస్తుతం మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుకుంటూ తమను తాము నిరూపించుకుంటున్నారు. ఇంటిని చక్కదిద్దడంతోనే ఆగిపోకుండా అంతరిక్షం వరకు అడుగులు వేస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ ప్రతిభను చాటిచెబుతున్నారు. అన్ని రంగాల మాదిరిగానే రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి పలువురు మహిళా నేతలు శాసన సభకు ప్రాతినిధ్యం కూడా వహించారు. ప్రస్తుతం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండి శాసన సభకు ప్రాతినిధ్య వహిస్తున్నది మహిళే. అంతవరకు బాగానే ఉన్నా ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆ అవకాశం ఏ మహిళ కు దక్కలేదు. స్థానిక సంస్థల్లో సగం స్థానాలు మహిళలకు రిజర్వ్ చేసినప్పటికి జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసి గెలిచి తమ సత్తా చాటారు. కానీ ఇంత వరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం దక్కలేదు. అంతవరకు ఎందుకు అసలు పోటీ చేసే అవకాశమే రాలేదు. మరో విశేషమేమింటే ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. 802575 పురుష ఓటర్లు ఉంటే, 842054 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఆదిలాబాద్, పెద్దపెల్లి 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అయితే పెద్దపెల్లి నుండి మహిళకు ప్రాతినిధ్యం దక్కింది. కానీ ఆదిలాబాద్ నుండి మాత్రం ఇంత వరకు ఆ అవకాశం రాలేదు. ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గానికి 1952 లో ఆదిలాబాద్ లోక్ సభ స్థానం ఏర్పాటైంది. 72 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు 18 సార్లు ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుండి 11మంది పార్లమెంటు సభ్యులుగా గెలుపొందారు. కానీ అందరు కూడా పురుషులే. ఇప్పటి వరకు ఇక్కడి నుండి మహిళకు ప్రాతినిధ్యమే లభించలేదు.

కానీ ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో తొలిసారిగా ప్రధాన రాజకీయ పార్టీ నుండి ఓ మహిళా అభ్యర్థి ఎన్నికల బరిలోకి దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన ఆత్రం సుగుణకు ఆ అవకాశం దక్కింది. ఉద్యోగ రీత్యా ఉపాధ్యాయురాలైన ఆత్రం సుగుణ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

పాము కరిచిందా? కంగారులో ఈ తప్పులు అస్సలు చేయొద్దు

అయితే మొదట జనరల్ స్థానంగా ఉన్న ఆదిలాబాద్ లోకసభ స్థానాన్ని 2009లో ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈ నియోజకవర్గాన్ని ఎస్టీ రిజర్వు స్థానంగా మార్చినప్పటి నుండి గిరిజనులైన రాథోడ్ రమేష్, గోడం నగేష్, సోయం బాపురావులు పోటీ చేసి గెలుపొందారు. రాథోడ్ రమేష్ తెలుగుదేశం పార్టీ తరఫున, గోడెం నగేష్ బిఆర్ ఎస్ పార్టీ తరఫున పోటీ గెలిచారు. 2019లో సోయం బాపురావు బిజెపి నుండి పోటి చేసి గెలిచారు. ప్రస్తుతం గోడెం నగేష్ బిజెపి నుండి పోటీ చేస్తుంటే రాథోడ్ రమేష్, సోయం బాపురావు మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. కానీ సోయం బాపురావు తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మీరు చెస్ ఆటలో రాణించాలా.. ఈ సీనియర్ చెస్ మాస్టర్ చెప్పే టిప్స్ వినండి ఓ సారి

ఇదిలాఉంటే కాంగ్రేస్ పార్టీ ఆచితూచి తమ అభ్యర్థిగా గోండు సామాజిక వర్గానికి చెందిన ఆత్రం సుగుణను బరిలో నిలిపింది. ప్రస్తుతం పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. ఏది ఏమైనప్పటికి తొలిసారిగా ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం మాత్రం ఓ మహిళకు దక్కింది. మరి ఈ ఎన్నికల్లో గెలిచి ప్రాతినిధ్యం దక్కించుకున్న తొలి మహిళగా కూడా రికార్ట్ సాధిస్తుందా అంటే అది మాత్రం ఓటర్ల చేతిలోనే ఉందని చెప్పక తప్పదు.

2024-04-25T08:31:53Z dg43tfdfdgfd