AMALAPURAM PARLIAMENTARY CONSTITUENCY : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?

Amalapuram Parliamentary Constituency: వైఎస్సాఆర్‌సీపీ(YSRCP) అమలాపురం పార్లమెంటు అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేసిన అధిష్టానం.. చివరకు రాకాపక వరప్రసాద్‌(Rapaka Varaprasad)ను బరిలోకి దింపింది. దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సరైన అభ్యర్ధి లేకనే రాపాకను రంగంలోకి దింపారనే టాక్ నడుస్తోంది. ఆయనకు పెద్దగా ఆసక్తి లేకున్నా తప్పక, తప్పదని బరిలో నిల్చున్నారనే వాదన కూడా ఉంది. జరుగుతున్న ఈ ఊహాగానాలకు ఆయన ప్రచారమే ఊతమిస్తోంది. 

ఇష్టం లేకున్నా బరిలోకి...

సిట్టింగ్‌ ఎంపీ చింతా అనురాధ(Chinta Anuradha)ను పక్కనుపెట్టి రాజోలు(Razole Assembly) సీటు ఆశించిన రాపాకను అమలాపురం పార్లమెంటు స్థానానికి పంపించారు. దీని వెనుక వైసీపీ వ్యూహం ఏదైనప్పటికీ ఆయనకు మాత్రం ఎంపీగా పోటీ చేయడం అంతగా ఇష్టం లేదని సన్నిహితులు చెబుతున్న మాట. టిక్కెట్టు కోల్పోయిన సిట్టింగ్‌ల కంటే తనపై అధిష్టానం మంచి దృక్పథంతోనే ఈ అవకాశం కల్పించిందన్న సంతృప్తితో రంగంలోకి దిగారు. ప్రచారంలో మాత్రం ఆ ఉత్సాహం కనిపించడం లేదని ప్రత్యర్థితో పోలిస్తే దూకుడుగా వెళ్లలేకపోతున్నరని స్థానికంగా వినిపిస్తున్న ప్రధాన విమర్శ. 

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోగా ఒక్క రాజోలు సీటు మాత్రమే దక్కించుకుంది. ఈ స్థానం నుంచి గెలిచిన జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తక్కువ కాలంలోనే వైసీపీ గూటికి చేరారు. అధికార పార్టీలో చేరినా రాజోలు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నిర్వహించిన సర్వేలో రాపాక ఓటమి ఖాయం అని తేలడంతో అక్కడ అభ్యర్ధిని మార్చేపనిలో ఉండగానే టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు(Gollapalli Suryarao)ను తెరపైకి తీసుకొచ్చారు. ఒకే సమయంలో అసెంబ్లీకు వైసీపీ అభ్యర్థిగా గొల్లపల్లి, అమలాపురం ఎంపీ అభ్యర్ధిగా రాపాకను ప్రకటించారు.

ఇంతకీ ఎందుకీ నిస్తేజం.. 

రాజోలు అసెంబ్లీ స్థానానికి గొల్లపల్లిని ప్రకటించడంతో రాపాక తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారన్న గుసగుసలు వినిపించాయి. రాజోలు రాపాకకే ఇవ్వాలన్న డిమాండ్‌తో నిసరన స్వరాలు వినిపించాయి. రాజోలు విషయంలో అధిష్టానం మరోసారి పునరాలోచించుకోవాలని రాపాక కోరారు. అధినాయకత్వం సర్ది చెప్పడంతో మేమిద్దరం ఒక్కటేనని, గొల్లపల్లి గెలుపు కోసం అంతా కృషి చేస్తామని ప్రకటించారు. తనకు అమలాపురం ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేసినా ప్రచారంలో వేగాన్ని అందుకో లేకపోతున్నారు. దీంతో ఆయనకు ఎంపీ స్థానంపై అసలు ఇంట్రెస్ట్‌ ఉందా.. గెలుస్తామా... అన్న మీమాంసలో కేడర్ కూడా కొట్టుమిట్టాడుతోంది. ఆయనికి కూడా ఇదే అనుమానాలు ఉన్నాయని అందుకే ప్రచారం అనుకున్న స్థాయిలో సాగడం లేదని టాక్. 

రగిలిపోతున్న జనసైనికులు..

రాజోలులో తమ పార్టీ తరఫున గెలిచి ఆ తరువాత పార్టీ ఫిరాయించిన రాపాకపై జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే బహిరంగంగానే రాపాకపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. వైసీపీలో ఉన్న ఓ వర్గం కూడా ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తుందన్న ప్రచారం నియోజకవర్గంలో నడుస్తోంది. వాళ్లు కూడా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడే అవకాశం లేకపోలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. 

దూసుకుపోతున్న ప్రత్యర్ధి..

వైసీపీ ఎంపీ అభ్యర్ధి రాపాక వరప్రసాదరావు ప్రచారంలో ఇంకా స్పీడు అందుకోకపోగా కూటమి అభ్యర్ధి గంటి హరీష్‌మాధూర్‌ (Ganti Harishmadhur) ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మండపేట (Mandapeta), ముమ్మిడివరం (Mummidivaram), కొత్తపేట (Kothapeta), పి.గన్నవరం (P. Gannavaram) నియోజకవర్గాలతోపాటు అమలాపురంలో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి సంబందించి సానుభూతి, జీఎంసీ బాలయోగి కుమారుడు కావడం కూడా ఆయనకు కలిసొచ్చేలా చూసుకుంటున్నారు.

2024-03-28T05:40:25Z dg43tfdfdgfd