AMIT SHAH INTERVIEW: భారత సైన్యం, సరిహద్దుల జోలికి రావొద్దు.. శత్రువులకు అమిత్ షా హెచ్చరిక

భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా).. కెనడా, అమెరికా, పాకిస్థాన్ లలో కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాదులను ఏరివేస్తున్నట్లు ఇటీవలి కాలంలో కొన్ని విదేశీ మీడియా కథనాలు ఆరోపించాయి. ఈ వార్తలన్నింటినీ భారత్ కూడా ఖండించింది. ఈ నేపథ్యంలో నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. ఇతర దేశాల్లో రా కోవర్ట్ ఆపరేషన్ చేస్తోందన్న వార్తలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవద్దని అమిత్ షా కోరారు. ఐతే భారత సరిహద్దులు, సైన్యాన్ని జోలికొస్తే.. తగిన సమాధానం లభిస్తుందని నేడు ప్రపంచం మొత్తం అర్థం చేసుకుందని అమిత్ షా అన్నారు.

రాహుల్ జోషి: పాకిస్తాన్‌లో 20 మంది ఉగ్రవాదులను భారత్ హతమార్చినట్లు గార్డియన్‌లో మరో నివేదిక వచ్చింది. R&AW కొందరిని చంపిందని, పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులు హతమయ్యారని కథనాలు వచ్చాయి? దీని గురించి మీరు ఏం చెబుతారు?

అమిత్ షా: ఎవరు చంపారు అనేది తేలాల్సి ఉంది.  భారతదేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు పాకిస్థాన్‌ గడ్డపై ఉన్నారని.. దీన్నిబట్టి స్పష్టమవుతోంది.

రాహుల్ జోషి:   ఇప్పుడున్న భారత్.. ఏదో మూలన నిలబడి తమాషా చూసే దేశం కాదని..  ప్రధానమంత్రితో పాటు మీ పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది అంటున్నారు. ఇంట్లోకి ప్రవేశించి చంపే భారతం అని చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలు ఏమిటి?

అమిత్ షా:  ఖచ్చితంగా. సర్జికల్‌ స్ట్రైక్‌, వైమానిక దాడుల తర్వాత.. భారత్‌ సరిహద్దులు, సైన్యం జోలికి పోకూడదని యావత్ ప్రపంచం అర్థం చేసుకుంది. రెచ్చగొడితే  అంతే ధీటుగా స్పందన ఉంటుంది.

రాహుల్ జోషి: భారతదేశంలో ఎన్నికల నిరంకుశత్వం, నియంతృత్వం, వివిధ విషయాల గురించి  పాశ్చాత్య మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి.  మీరు దీన్ని ఎలా చూస్తారు? ఎన్నికల సమయంలో ఈ వాదనలు  తెరపైకి రావడం  వెనుక ఏదైనా కుట్ర ఉందా?

అమిత్ షా: అన్ని కుట్రలను విస్మరిద్దాం. మన  ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికలు..  ప్రపంచంలోనే అత్యంత పారదర్శకం, విశ్వసనీయమైనవి అని నేను చాలా గర్వంగా, విశ్వాసంతో చెబుతున్నా.

2024-05-02T11:15:21Z dg43tfdfdgfd