ARMY RECRUITMENT RALLY: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, పలు విభాగాల్లో అగ్నివీర్‌ ఎంపికలు

Army Recruitment: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని మొదటి ఈఎంఈ సెంటర్‌లో జూన్‌ 20 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. అగ్నివీర్‌ జనరల్ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ క్లర్క్‌, అగ్నివీర్‌ టీడీఎన్‌ పోస్టుల భర్తీకి ఈ ర్యాలీని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

యుద్ధంలో భర్తలను కోల్పోయిన వితంతువులు, వితంతువుల పిల్లలు, భారత సైన్యంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న వారి కుమారులతో పాటు సర్వీస్‌లో ఉన్న వారి సొంత సోదరులు అగ్నివీర్‌ ఉద్యోగాలకు అర్హులని ప్రకటించారు.

అగ్నివీర్‌ సర్వీసుల్లో చేరడానికి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 20న తెల్లవారుజామున 5 గంటలకు మొదటి ఈఎంఈ సెంటర్‌, 4వ ట్రైనింగ్‌ బెటాలియన్‌, కోటేశ్వర్‌ ద్వార్‌ వద్దకు రావాలని ఆర్మీ అధికారులు కోరారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో స్పోర్ట్స్ కోటా కింద స్విమ్మింగ్, వాలీబాల్ క్రీడాకారులను అర్హులుగా పరిగణిస్తామని వెల్లడించారు. ఈ పోస్టులకు పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు మాత్రమే అర్హులని తెలిపారు.

అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం [email protected] వెబ్‌సైట్లను లేదా 040-27863016 నంబరును సంప్రదించి సమాచారాన్ని తెలుసుకోవచ్చని సూచించారు.

అగ్నివీర్ జనరల్ డ్యూటీకి విద్యార్హత పదో తరగతి/ మెట్రిక్ ఉత్తీర్ణతతో పాటు ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. గ్రేడింగ్ విధానాన్ని అనుసరించే బోర్డులకు కనీసం 'డి' గ్రేడ్ వ్యక్తిగత సబ్జెక్టుల్లో 33 శాతం-40 శాతం లేదా నిర్దిష్ట సబ్జెక్టుల్లో 33 శాతం ఉన్న గ్రేడ్లు, మొత్తంగా 'సీ2' గ్రేడ్ లేదా తత్సమాన మొత్తం 45 శాతం గ్రేడ్ ఉండాలని తెలిపారు.

అగ్నివీర్ టెక్నికల్ కు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో, ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. లేకుంటే ఏదైనా గుర్తింపు పొందిన రాష్ట్ర విద్యా మండలి లేదా సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి విద్యార్హతతో 10వ తరగతి/మెట్రిక్ ఉత్తీర్ణతతో పాటు అవసరమైన రంగంలో కనీసం ఒక ఏడాది పాటు ఎన్ ఐఓఎస్, ఐటీఐ కోర్సులను పూర్తి చేసి ఉండాలి.

ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ నుంచి రెండేళ్ల టెక్నికల్ ట్రైనింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్లో రెండు మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

అగ్నివీర్ సీఎల్ కే/ఎస్ కేటీ విభాగాలకు ఇంటర్మీడియట్ లో ఏదైనా విభాగంలో (ఆర్ట్స్ , కామర్స్ , సైన్స్ ) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత, 12వ తరగతిలో ఇంగ్లిష్ , మ్యాథ్స్ /ఏసీటీఎస్ /బుక్ కీపింగ్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి.

అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ కు 10వ తరగతి, పదో తరగతిలో సాధారణ ఉత్తీర్ణత ఉండాలి. అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ కు 8వ తరగతి, 8వ తరగతి సాధారణ ఉత్తీర్ణత.

అర్హులైన అభ్యర్థులు జూన్ 20, 2024 సాయంత్రం 5 గంటలకు కోటేశ్వర్ ద్వార్, 4 ట్రైనింగ్ బెటాలియన్, 1 ఈఎంఈ సెంటర్, సికింద్రాబాద్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

2024-05-07T08:07:23Z dg43tfdfdgfd