BJP ప్రభుత్వంపై వ్యతిరేకతతో మహిళలు గుండు చేయించుకున్నారా..? ఈ వీడియో నిజమా?

BJP Govt: ఎన్నికల సమయంలో చాలా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇందులో కొన్ని నిజమైనవి, మరికొన్ని మార్ఫింగ్ చేసినవి ఉంటాయి. ఇక నిజమైన వీడియోలు కూడా గతంలో జరిగినవి తీసుకొచ్చి ఇప్పుడు జరిగాయి అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. మిగితా నెటిజన్లు వాటిని లైక్‌లు, షేర్లు, కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా వైరల్ అవుతున్న వీడియో సంచలనంగా మారింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన మహిళలు.. తమ నిరసనను తెలియజేసేందుకు తమ జుట్టు తీసేసి గుండు చేయించుకున్నారన్నట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అంతేకాకుండా దేశంలోనే ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఏం ఉంది?

ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందు బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఆందోళనన కార్యక్రమాలు చేపట్టిన కొంతమంది మహిళలు తమ నిరసనను వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి గుండు చేయించుకుంటున్న వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే ఇలాంటి నిరసన జరగడం దేశంలోనే ఇదే తొలిసారి అంటూ ఆ వీడియోలకు క్యాప్షన్ కూడా జోడించారు.

ఆ వీడియోలు ఎక్కడివి, అసలు నిజం ఏంటి?

వైరల్ అవుతున్న వీడియోలు ఇప్పటివి కాదు. 2018 జూలై 25 వ తేదీన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన సంఘటనకు సంబంధించినవి. ఉత్తర్‌ప్రదేశ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న వందలాది మంది తాత్కాలిక టీచర్లు.. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగానే కొందరు మహిళలు, పురుషులు గుండు చేయించుకుని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన చేపట్టారు. అంతేకాకుండా ఇలాంటి ఘటన దేశంలో జరగడం ఇదే తొలిసారి కాదు. దానికి ముందు 2018 జనవరిలో మధ్యప్రదేశ్‌లో.. 2017లో అస్సాంలో కూడా కొంతమంది మహిళలు ఇలా గుండు చేయించుకుని ప్రభుత్వం పట్ల తమ నిరసనను వ్యక్తం చేశారు.

వెరిఫికేషన్ అండ్ మెథడాలజీ

వైరల్ అవుతున్న వీడియో ఎంత వరకు నిజం అనే దానిపై ఫ్యాక్ట్‌లీ అనే ఫ్యాక్ట్‌చెక్ సంస్థ ఫ్యాక్ట్‌చెక్ చేసింది. ఆ వీడియోలో ఉన్న మహిళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి, ఆ రాష్ట్రంలోని తాత్కాలిక టీచర్ల గురించి మాట్లాడటం గమనించవచ్చు. దీంతో అవే కీవర్డ్‌లను ఉపయోగించి గూగుల్‌లో సెర్చ్ చేయగా.. అసలు వీడియో బయటికి వచ్చింది. అందులో మహిళలు గుండు చేయించుకుంటున్న వీడియోలతోపాటు కొన్ని వార్తా కథనాలు కూడా కనిపించాయి. 2018 జూలై 25 వ తేదీన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఎకో గార్డెన్‌లో వందలాది మంది తాత్కాలిక టీచర్లు.. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, వార్తలు కనిపించాయి.

ఉత్తరప్రదేశ్‌లోని తాత్కాలిక టీచర్లు చేపట్టిన గతంలో చేసిన నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని.. తాత్కాలిక ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని.. టెట్‌ పాసైన వారికి వెంటనే నియామక పత్రాలు జారీ చేయాలని భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగానే వందలాది మంది ఆడ, మగ టీచర్లు గుండు చేయించుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ సంఘటన దేశంలో తొలిసారి కాదు. అంతకుముందు 2017లో అస్సాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముగ్గురు మహిళలు గుండు చేయించుకున్నారు. 2018 జనవరిలో కూడా మధ్యప్రదేశ్‌లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు.. తమను రెగ్యులరైజ్ చేయాలని నలుగురు మహిళలు గుండు చేయించుకుని తమ నిరసన తెలిపారు.

నిజం

2018 లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాత్కాలిక టీచర్లు చేసిన నిరసనలు.. అందులో కొందరు మహిళలు గుండు చేయించుకుంటున్న వీడియోలు.. ప్రస్తుతం ఎన్నికల వేళ జరిగాయని.. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అంతేకాకుండా ఇదే దేశంలో తొలి సంఘటన అని చెప్పడం తప్పు అని రుజువు అయింది.

(This story was originally fact checked by Factly and Edited by Samayam Telugu, as part of the Shakti Collective)

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-09T13:54:43Z dg43tfdfdgfd