CITIES SINKING: భూమిలోకి కుంగిపోతున్న నగరాలు, నిర్లక్ష్యం చేస్తే అంతా నేలమట్టం!

Cities Sinking in China: చైనాకి మరో పెద్ద ముప్పు వచ్చి పడింది. ఆ దేశంలోని నగరాలు క్రమంగా (China Cities Sinking) కుంగిపోతున్నాయని ఓ రిపోర్ట్ సంచలన విషయం వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిర్మాణాల సంఖ్య భారీగా పెరగడం వల్ల ఆ బరువుని నేల తట్టుకోలేకపోతోందని స్పష్టం చేసింది. మితిమీరి భూగర్భజలాల్ని తోడుకోవడం వల్ల కూడా నేల కుంగిపోతోందని తెలిపింది. చైనాలోని బీజింగ్, తియాంజిన్ సహా మరి కొన్ని నగరాలు ఈ ప్రమాదంలో ఉన్నాయని రిపోర్ట్ వెల్లడించింది. పట్టణాల్లోని నేలలో దాదాపు 45% మేర చాలా వేగంగా కుంగిపోతోందని, ఏడాదికి 3 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా కూరుకుపోతోందని వివరించింది. 20 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో నేల తీరుని పరిశీలించిన సైంటిస్ట్‌లు ఈ విషయాలు వెల్లడించారు. 2015-22 మధ్య కాలంలో ఈ సర్వే జరిగింది. మొత్తం 82 నగరాల్లో నేలని పరీక్షించగా కొన్ని సిటీలు మరీ ప్రమాదకర పరిస్థితులున్నాయని తేలింది. కనీసం ఆరు నగరాల్లో ఓ చోట ఏడాదికి 10 మిల్లీమీటర్ల చొప్పున నేల కుంగిపోతోందని గుర్తించారు సైంటిస్ట్‌లు. చైనాలోనే అత్యంత భారీ నగరమైన షాంఘాయ్‌లో గత శతాబ్ద కాలంలో నేల 3 మీటర్ల మేర కుంగిపోయింది. 

అటు బీజింగ్‌లో 45 మిల్లీమీటర్ల చొప్పున భవనాలు క్రమంగా కుంగిపోతున్నాయి. భూగర్భ జలాల్ని మితిమీరి తోడేస్తుండడం, పరిమితి అంటూ లేకుండా భవనాలు నిర్మించడం, రహదారుల విస్తరణ లాంటి కారణాలతో భూమి డొల్లగా మారుతోంది. ప్రస్తుతానికి ఉన్న భవనాల బరువుని మోసేంత సామర్థ్యం కొన్ని నగరాల్లోని భూమిలో తగ్గిపోతోందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. నగరాల్లో ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్ విస్తరిస్తుండడమూ సమస్యగా మారింది. ఇష్టారీతిన మైనింగ్ చేయడం, హైడ్రోకార్బన్‌ని పెద్ద ఎత్తున వెలికితీయడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంది. ఇప్పటికిప్పుడు భూగర్భ జలాల వెలికితీతను కంట్రోల్ చేయకపోతే భవిష్యత్‌లో నగరాలన్నీ కుంగిపోతాయని ఈ అధ్యయనం హెచ్చరించింది. దీర్ఘకాలిక సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టకపోతే ముప్పు తప్పదని వార్నింగ్ ఇచ్చింది. 

2024-04-20T07:38:24Z dg43tfdfdgfd