DELHI LIQUOR CASE: ఈడీకి అదే కావాలి.. అందుకే కేజ్రీవాల్ ఫోన్‌ వివరాలు అడుగుతోంది: అతిషి

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడంపై ఢిల్లీ మంత్రి అతిషి మార్లేనా ఈడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈడీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బీజేపీకి రాజకీయ ఆయుధంగా ఈడీ పనిచేస్తోందని అతిషి తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఫోన్ గురించి పదే పదే ఈడీ అడగడంపై అతిషి అనుమానం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని సేకరించాలని ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ ఫోన్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకుని.. పార్టీని దెబ్బతీసేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్‌ మంత్రి అతిషి ఆరోపించారు.

ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బకొట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను.. బీజేపీ ప్రయోగిస్తోందని ఢిల్లీ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ ఫోన్‌ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని ఈడీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. అందుకే ఆయన ఫోన్‌ను ఈడీ అధికారులు అడుగుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన 2021-22 ఏడాదిలో కొన్ని రోజులపాటే ఆ విధానం ఢిల్లీలో అమల్లో ఉందని పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగించాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో గురువారం ఈడీ అధికారులు చేసిన వాదనలను ప్రస్తావించిన అతిషి.. 2021-22లో సీఎం కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్‌ ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ వినియోగిస్తున్న సెల్‌ఫోన్ కొన్ని నెలల క్రితమే కొన్నారని పేర్కొన్నారు. అయితే ఈడీ ఆరోపిస్తున్నట్లు మద్యం కుంభకోణం జరిగినప్పటి ఫోన్ కావాలి కానీ.. ఇప్పుడు కొన్న కొత్త ఫోన్‌ పాస్‌వర్డ్‌, లాగిన్ వివరాలు ఎందుకు అని అతిషి ప్రశ్నించారు. ప్రస్తుతం ఈడీ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే బీజేపీకి రాజకీయ ఆయుధంగా ఈడీ పనిచేస్తోందని అర్థం అవుతోందని మండిపడ్డారు.

ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తు కోసం ఈడీ అధికారులు కేజ్రీవాల్ సెల్‌ఫోన్ పాస్‌వర్డ్‌లు అడగడం లేదని.. కేజ్రీవాల్‌ ఫోన్‌లో ఏముందో తెలుసుకునేందుకు బీజేపీ చేస్తున్న రాజకీయ కుట్ర అని అతిషి తీవ్ర విమర్శలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలు, విపక్ష ఇండియా కూటమి నేతలతో జరిపిన చర్చలు, మీడియా-సోషల్‌ మీడియా ప్రచారానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అని ఆరోపించారు. ఇక గురువారం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచగా.. ఏప్రిల్ 1 వ తేదీ వరకు కస్టడీ పొడగిస్తూ తీర్పు వచ్చింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇంట్లో సీజ్ చేసిన 4 డిజిటల్‌ పరికరాల పాస్‌వర్డ్‌లు, లాగిన్‌ వివరాలను ఆయన చెప్పలేదని ఈడీ కోర్టుకు తెలిపింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-29T10:37:49Z dg43tfdfdgfd