DOORDARSHAN LOGO: దూరదర్శన్ కొత్త లోగో వివాదాస్పదం, కాషాయ రంగుపై ప్రతిపక్షాల అసహనం

Doordarshan Changes Logo: దూరదర్శన్ లోగో మార్పుపై (Doordarshan Logo Change) పెద్ద వివాదమే నడుస్తోంది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందే లోగోని కాషాయ రంగులోకి మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. దూరదర్శన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ DD News ఇటీవలే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇదే మా కొత్త లోగో అంటూ ఓ ప్రమోషనల్ వీడియో విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం రాజుకుంది.

తమ సిద్ధాంతాలు ఎప్పటికీ మారవని, కాకపోతే కాస్త కొత్తగా అందరి ముందుకు వస్తున్నామని దూరదర్శన్ ప్రకటించింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్ సిర్కార్ దూరదర్శన్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ మాజీ సీఈవో ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్టు వెల్లడించారు. కాషాయ రంగులో లోగోని మార్చి ఓటర్లను ప్రభావితం చేసే కుట్ర చేస్తోందని బీజేపీపై విమర్శలు చేశారు. స్వతంత్రంగా పని చేసే ఇలాంటి సంస్థలపైనా బీజేపీ తమ సిద్ధాంతాలను రుద్దుతోందని మండి పడ్డారు. ఈ మేరకు X వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. 

"ఎంతో చరిత్రాత్మకమైన దూరదర్శన్ లోగోని కాషాయ రంగులోకి మార్చడం ఆందోళన కలిగించింది.  ఓ మాజీ సీఈవోగా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలా కాషాయ రంగుని వేయడం ముమ్మాటికీ సరికాదు. ఇప్పటి నుంచి ఇది ప్రసార భారతిగా కాకుండా ప్రచార భారతిగా మారిపోతుందేమో అన్న ఆందోళన కలుగుతోంది"

- జవహర్ సిర్కార్, ప్రసార భారతి మాజీ సీఈవో

2012-16 మధ్య కాలంలో ప్రసార భారతి సీఈవోగా పని చేశారు జవహర్. అటు ఆల్ ఇండియా రేడియో సీఈవో బాధ్యతలూ చేపట్టారు. ఎంతో పేరు, కీర్తి ఉన్న దూరదర్శన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదని అసహనం వ్యక్తం చేశారాయన. అంతే కాదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌నీ ఇది ఉల్లంఘించడమే అవుతుందని తేల్చి చెప్పారు. అయితే...ప్రస్తుత యాజమాన్యం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. కేవలం లోగో బాగా కనిపించాలనే ఉద్దేశంతోనే ఆ రంగులోకి మార్చామని వెల్లడించింది. కేవలం లోగో మాత్రమే కాదని, పూర్తిగా ఛానల్‌నే అప్‌గ్రేడ్ చేసినట్టు వివరించింది. 

2024-04-20T08:06:32Z dg43tfdfdgfd