DOORDARSHAN: కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. ఎన్నికల వేళ బీజేపీపై తీవ్ర విమర్శలు

Doordarshan: దూరదర్శన్. ఒకప్పుడు న్యూస్ ఛానల్ అంటే గుర్తొచ్చేది దూరదర్శన్. వార్తలు ప్రారంభం అయిందే డీడీ న్యూస్‌ ద్వారా. అయితే రాను రాను ప్రైవేటు ఛానల్స్ రావడంతో దూరదర్శన్ పేరు ఇప్పుడు పెద్దగా వినిపించలేదు. భారత ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ ఛానల్‌గా ఉన్న దూరదర్శన్ లోగోలో మార్పు చోటు చేసుకుంది. మార్పు అంటే దూరదర్శన్‌ లోగో కలర్ మాత్రమే మారింది. ఇప్పటివరకు ఎరుపు రంగులో ఉన్న దూరదర్శన్ లోగో కలర్ కాస్తా.. కాషాయం రంగులోకి మార్చారు. ఇప్పుడు ఇదే దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే సాధారణ కలర్ మార్పు అయినప్పటికీ అది కాషాయం రంగులోకి మార్చడమే ఇక్కడ వివాదానికి కారణం అయింది. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర మాటల తూటాలకు కారణం అయింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

దూరదర్శన్ ఛానల్ యాజమాన్యం ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే డీడీ న్యూస్ లోగో రంగును ఎరుపు నుంచి కాషాయ రంగులోకి మారుస్తూ ఏప్రిల్ 16 వ తేదీన నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలియజేసింది. రంగు మారినా విలువలు మాత్రం అలాగే ఉన్నాయంటూ డీడీ ప్రకటించింది. లోగోతోపాటు దాని కింద ఉంటే న్యూస్‌ అనే టెక్స్ట్‌లో మార్పులు చేశారు. డీడీకి బదులుగా న్యూస్‌ అని హిందీ అక్షరాలు లోగో కింద ఉంచారు. అత్యాధునిక స్టూడియో సిస్టమ్, పునరుద్ధరించిన వెబ్‌సైట్‌ను దూరదర్శన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రస్తుతం దూరదర్శన్ కొత్త అవతారంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కానీ దూరదర్శన్ విలువలు మాత్రం అలాగే ఉన్నాయి. గతంలో లేని విధంగా సరికొత్త వార్తలను అందిస్తామని తెలిపింది. వేగం కంటే కచ్చితత్వం, దావాల కంటే వాస్తవాలు, సెన్సేషనలిజం కంటే నిజాలు ప్రజల ముందు ఉంచుతామని పేర్కొంటూ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోను డీడీ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక ఎన్నికల వేళ.. దూరదర్శన్ లోగోతోపాటు రంగు మారడం తీవ్ర విమర్శలకు కారణం అయింది. దశాబ్దాల చరిత్ర ఉన్న డీడీ న్యూస్‌ లోగో కాషాయరంగులోకి మారిపోయింది. "ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి" అని దూరదర్శన్‌ మాజీ సీఈవో, టీఎంసీ ఎంపీ జవహర్‌ సర్కార్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. దూరదర్శన్‌ లోగో రంగు మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించి వార్తలను ప్రసారం చేసే దూరదర్శన్‌ న్యూస్‌ ఛానల్‌ లోగో రంగును కాషాయ రంగులోకి మార్చేశారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్.. అన్నింటి రంగులను మార్చేస్తోందని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం దేశంలో చాలా పాపులర్ అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కలర్‌ను కూడా నీలం రంగు నుంచి కాషాయ రంగులోకి మార్చారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. బీజేపీ రంగు కాషాయం కాబట్టి దేశంలోని అన్నింటికీ కాషాయ రంగే ఉండాలని చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక దూరదర్శన్ 1959 సెప్టెంబర్ 15 వ తేదీన ప్రారంభమైంది. 1965 లో దూరదర్శన్ న్యూఢిల్లీ వార్తలను ప్రసారం చేసింది. 1975 నాటికి ఈ దూరదర్శన్ సేవలను ముంబై, అమృత్‌సర్ సహా దేశంలోని ఏడు నగరాలకు విస్తరించారు. 1976 ఏప్రిల్ 1 వ తేదీన దూరదర్శన్.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక విభాగం కిందకు తీసుకువచ్చారు. ప్రస్తుతం దూరదర్శన్ ఆరు జాతీయ ఛానళ్లు, 17 ప్రాంతీయ ఛానళ్లను కలిగి ఉంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-19T17:42:23Z dg43tfdfdgfd