FACT CHECK: ఆంధ్రా ప్రజలు తెలంగాణ ప్రజల కన్నా తెలివైన వారు అని KTR అన్నారా?

ఆంధ్రా ప్రజలు తెలంగాణ ప్రజల కన్నా తెలివైన వారు అని KTR అన్నది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రశ్నకు

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలంగాణ ప్రజలను అవమానించాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘ఆంధ్రా వాళ్ళు తెలంగాణ వాళ్ళ కంటే ఎక్కువ తెలివైన వాళ్ళని, అందుకే వారు ఎక్కువగా ఉండే హైదరాబాద్ ప్రాంతంలో తమను ఎక్కువ సీట్లలో గెలిపించారని, తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక్క సీటు రాలేదని’ KTR వ్యాఖ్యానించినట్టు ఈ వీడియో ద్వారా అర్ధమవుతుంది (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియోకు కొనసాగింపుగానే  తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ KTR ఇలా మాట్లాడి తెలంగాణ సమాజాన్ని అవమానించాడని ఆరోపిస్తాడు. ఈ కథనం ద్వారా KTR  చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రా వాళ్ళు తెలంగాణ వాళ్ళకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు. అందుకే వారు ఎక్కువగా ఉండే హైదరాబాద్ ప్రాంతంలో తమను ఎక్కువ సీట్లలో గెలిపించారు – KTR

ఫాక్ట్(నిజం): ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆంధ్రా ప్రజలు తెలంగాణ ప్రజలకన్నా తెలివైన వారు, కాబట్టి వారు సరైన నిర్ణయం తీసుకుంటారు అని KTR స్పందించాడు. అంతకు ముందు తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తు చేసుకొని ‘అప్పట్లో ప్రాంతంగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటాం అని మేము చెప్పింది ఆచరణలో చూపెట్టాం, అందుకే TRS పార్టీకి ఉనికి లేదు అనుకున్న హైదరాబాద్‌లో ఈ రోజు మాకు ఓటేసారు. ఇవ్వాళ మా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వలేదు అని అన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించేలా ఉంది.

ఒక మీడియా ఇంటర్వ్యూలో KTR మాట్లాడుతూ ఆంధ్రా ప్రజలు తెలివైన వారు అని నిజంగానే అన్నారు. ఐతే KTR వేరే సందర్భంలో ఈ మాటను అన్నారు, తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాదు.

ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం యూట్యూబ్‌లో వెతకగా ఇటీవల 12 ఏప్రిల్ 2024న TV9తో జరిగిన ఇంటర్వ్యూలో KTR ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఈ  ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు KTR స్పందిస్తూ తెలంగాణ ఉద్యమం గురించి గుర్తు చేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ‘మేము రాష్ట్రం కోసం పోరాడే సమయంలో ఒక మాట పదే పదే చెప్పేవాళ్ళం, ప్రాంతంగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటాం. మేము ఆచరణలో చూపెట్టాం ఈ పదేళ్లు, అందుకే TRS పార్టీకి ఉనికి లేదు అనుకున్న హైదరాబాద్‌లో ఈ రోజు అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు మాకు ఓటేసారు. ఇవ్వాళ మా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వలేదు, హైదరాబాద్‌లో’ అని వ్యాఖ్యానించాడు.

దీనికి కొనసాగింపుగానే ఆయన మాట్లాడుతూ ‘విభజన వికాసానికే కాబట్టి, ఇవ్వాళ రెండు రాష్ట్రాలు బాగుండాలి. తెలంగాణ బాగుండాలి, ఆంధ్ర బాగుండాలి. అక్కడి ప్రజలు చాలా తెలివైన వారు. ఆంధ్రా ప్రజలు తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైన వారు, చైతన్యవంతులు, కాబట్టి వారు సరైన నిర్ణయం తీసుకుంటారు,’ అని అన్నారు.

KTR వ్యాఖ్యలను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనాల ప్రకారం కూడా KTR ఆంధ్రా ప్రజలు తెలంగాణ ప్రజలకన్న తెలివైన వారు అని అన్నది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అడిగిన ప్రశ్నకని స్పష్టమవుతుంది. దీన్నిబట్టి KTR రెండు వేరే విషయాల గురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను డిజిటల్‌గా ఎడిట్ చేసినట్టు అర్ధమవుతుంది.

చివరగా, ఆంధ్రా ప్రజలు తెలంగాణ ప్రజల కన్నా తెలివైన వారు అని KTR వ్యాఖ్యానించింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రశ్నకు.

( గమనిక: శక్తి కలెక్టీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా (Factly ) అందించిన ఇన్‌పుట్స్ ఆధారంగా ఈ కథనం పబ్లిష్ చేశాం.)

2024-05-07T11:19:21Z dg43tfdfdgfd