TAMIL NADU: నడిరోడ్డుపై బోల్తా పడ్డ బంగారంతో వెళ్తున్న కంటైనర్.. క్వింటాళ్ల కొద్ది ఆభరణాలు

Gold Jewels: సాధారణంగా ఏటీఎంలలో డబ్బులు నింపేందుకు వెళ్లే సిబ్బంది డబ్బుతో వెళ్లే వాహనాలు, ఇక భారీ ఎత్తున బంగారం, బంగారు ఆభరణాలను తరలించే వాహనాలు.. రోడ్లపై చాలా జాగ్రత్తగా వెళ్తాయి. అంతేకాకుండా ఆ వాహనాల వెంట పటిష్ఠ బందోబస్తు ఉంటుంది. ఎందుకంటే వాటి విలువ అంత ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ మాత్రం వందల కోట్ల విలువైన వందల కిలోల బరువు గల బంగారు ఆభరణాలతో వెళ్తున్న ఓ లారీ కంటైనర్.. నడిరోడ్డుపై బోల్తా పడింది. ఆ ఘటనలో ఆ కంటైనర్‌లో ఉన్న డ్రైవర్, సెక్యూరిటీ గార్డు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

తమిళనాడులోని ఈరోడ్‌లో బంగారు ఆభరణాలను తరలిస్తున్న ఓ కంటైనర్ బోల్తా పడింది. ఈరోడ్‌ సమీపంలోని చిటోడే వద్ద సోమవారం రాత్రి ఆ కంటైనర్ బోల్తా పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో కంటైనర్‌లో 810 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. అది ఒక ప్రైవేటు కంటైనర్ అని.. అందులో ఉన్న బంగారు ఆభరణాల విలువ రూ.666 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసులు తెలిపారు.

ఓ ప్రైవేట్ లాజిస్టిక్స్‌ కంపెనీకి చెందిన ఓ కంటైనర్‌.. కోయంబత్తూరు నుంచి సేలంకు బంగారు ఆభరణాలను తీసుకుని వెళ్తుండగా.. ఈ ప్రమాదం సంభవించింది. సమతువపురం సమీపంలోకి రాగానే కంటైనర్ డ్రైవర్‌.. వాహనంపై కంట్రోల్ తప్పడంతో ఆ కంటైనర్ బోల్తా పడింది. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్‌ శశికుమార్‌తో పాటు బంగారు ఆభరణాలకు సెక్యూరిటీ గార్డుగా ఉన్న బాల్‌రాజ్‌కు గాయపడ్డారు.

బంగారం కంటైనర్ బోల్తా పడిన ఘటనపై సమాచారం అందుకున్న చిటోడే పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బోల్తా పడిన కంటైనర్‌ను చెక్ చేసిన పోలీసులు.. అందులో ఉన్న బంగారు ఆభరణాలు సురక్షితంగానే ఉన్నట్లు వెల్లడించారు. బంగారం కంటైనర్ బోల్తా పడిన సంఘటన విషయంపై ఆ కంపెనీ యాజమాన్యానికి సమాచారం అందించినట్లు పోలీసులు చెప్పారు. ఆ కంపెనీ ప్రతినిధులు వెంటనే స్పందించి ఘటనా స్థలికి మరో కంటైనర్‌ను పంపించగా.. బోల్తాపడిన కంటైనర్‌లోని బంగారు ఆభరణాలను మరో కంటైనర్‌లోకి ఎక్కించి సేలంకు తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిటోడే పోలీసులు తెలిపారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T13:15:08Z dg43tfdfdgfd