HINDUPURAM POLITICS : కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ

Paripoornanamda :  శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి హిందూపురం పార్లమెంటు స్థానం విషయంలో పట్టు వీడటం లేదు.  ఇప్పటికే హిందూపురం పార్లమెంటు స్థానానికి కూటమి అభ్యర్థిగా సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బికె పార్థసారధిని కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. ముందు నుంచి హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద  పోటి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం సాగింది. అందుకు అనుగుణంగానే పరిపూర్ణానంద స్వామీజీ హిందూపురం పార్లమెంటులోని పెనుగొండ నియోజకవర్గాన్ని  స్థావరంగా ఏర్పాటు చేసుకొని గత నాలుగు ఐదు నెలలుగా అక్కడే మాఖం వేశారు. 

బీజేపీలోనే ఉండి రెబల్‌గా పోటీ 

పార్లమెంటు వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు కూడా. ముందుగా బిజెపి అధిష్టానం నుంచి మాట తీసుకొని హిందూపురం పార్లమెంటు వచ్చానని పరిపూర్ణానంద స్వామి తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏర్పడిన అనంతరం జరిగిన పరిణామాలతో తనకు హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా టికెట్ ఇవ్వకుండా కొంతమంది తమ స్వలాభం కోసం అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పార్టీలో చేరాక సాయంత్రం అభ్యర్థిగా ఎంపిక అంటూ తిరుపతిలో వరప్రసాద్ రావును బిజెపి ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడానికి పరోక్షంగా విమర్శించారు. దీంతో తాను తీసుకున్న నిర్ణయం మేరకు హిందూపురం పార్లమెంటు నుంచి పార్లమెంటు అభ్యర్థిగా అలాగే హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నట్లు పరిపూర్ణానంద స్వామి వెల్లడించారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా హిందూపురం పార్లమెంటు వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ నిర్ణయం సంచలనంగా మారింది. తాను బిజెపి పార్టీలోనే ఉంటాను అంటూనే కూటమిలో రెబల్ అభ్యర్థిగా పార్లమెంట్ స్థానం నుంచి అలాగే హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని చెప్పడం బిజెపి అధిష్టానం ఏ మేరకు దీనిపైన స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.  తాను హిందూపురం పార్లమెంటు మరియు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురుందేశ్వరికి స్పష్టం చేసినట్లు వెల్లడించారు. 

సీటు రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారు !

 

హిందూపురం పార్లమెంటు కూటమి అభ్యర్థిగా టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి.. వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా శాంతమ్మ.. హిందూపురం అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసిపి అసెంబ్లీ అభ్యర్థిగా కురుబ దీపిక పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ స్వామీజీ పరిపూర్ణానంద చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనగా మారాయి. టిడిపి బిజెపి జనసేన పొత్తు కుదరక ముందు నుంచి హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి తాను పోటీ చేస్తానని బిజెపి అధిష్టానానికి పరిపూర్ణ స్వామి స్పష్టం చేశానని.. దానికి అనుగుణంగానే బిజెపి అధినాయకత్వం కూడా తనవైపు మొగ్గు చూపిందన్నారు. కానీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా టిడిపి పార్టీ నుంచి పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ వత్తిడి వల్లే బిజెపిలో పార్లమెంట్ అవకాశం తనకు ఇవ్వకుండా చేశారన్నారు. 

పరిపూర్ణానంద పోటీపై పెద్దగా స్పందించని  బీజేపీ నేతలు

హిందూపురంలో మైనార్టీ ఓట్లు 60 వేలకు పైగా ఉన్నాయని బిజెపికి పార్లమెంటు సీటు ఇవ్వడం వలన మైనార్టీ ఓట్లు టిడిపికి పడవని దీంతో తన గెలుపు కష్టమవుతుందని బాలకృష్ణ భావించి తనకు టికెట్ ఇవ్వకుండా చేశారని పరిపూర్ణానంద స్వామీజీ ఆరోపించారు.  టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు బాలకృష్ణ ఒత్తిడి మేరకే హిందూపురం టికెట్ తనకు దక్కకుండా పోయిందని వెల్లడించారు. తనకు బిజెపి టికెట్ దక్కకపోయినా పోటీ నుంచి విరమించే ప్రసక్తే లేదంటూ చెబుతూనే హిందూపురం పార్లమెంటు నుంచి అలాగే హిందూపురం అసెంబ్లీ నుంచి కూడా స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయడం ఖాయమని పరిపూర్ణానంద స్వామి స్పష్టం చేశారు. మూడు పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని పరిపూర్ణానంద స్వామి పెడచెవిన పెడుతుండడంపై కూటమి అధినేతలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయని ఆసక్తికరంగా మారింది.

2024-03-29T09:23:44Z dg43tfdfdgfd