JHARKHAND: రూ.10 వేల లంచం కేసులో తీగ లాగితే.. రూ.35 కోట్ల గుట్టురట్టు!

పార్లమెంట్‌ ఎన్నికల వేళ ఝార్ఖండ్‌ (Jharkhand) మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పనిమనిషి నివాసంలో గుట్టలకొద్దీ నోట్ల కట్టలు బయటపడటం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ అలం ప్రైవేటు కార్యదర్శి పనిమనిషి ఇంటి నుంచి సోమవారం రూ.35 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ అవినీతి చక్రవర్తి వ్యవహారం రూ.10వేల లంచం కేసుపై దర్యాప్తుతతోనే బయటపడటం గమనార్హం. ఏడాది కిందటి లంచం వ్యవహారాన్ని దర్యాప్తు చేపట్టడంతో నోట్ల గుట్టలు వెలుగుచూశాయి.

రూ.10 వేలు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై గత ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ వీరేంద్ర కుమార్‌ రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది. అయితే, అతడు అవినీతి ఈస్థాయిలో ఉంటుందని అధికారులు భావించి ఉండరు. ఏప్రిల్ 14, 2023 నాటి విచారణలో అతడు వెల్లడించిన విషయాలు విని అధికారులే విస్తుపోయారు. కాంట్రాక్టర్లకు టెండర్ల ఆశ జూపి వారి నుంచి భారీ మొత్తంలో తీసుకున్నట్టు విచారణలో వీరేంద్ర చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో పలువురు ఉన్నతస్థాయి వ్యక్తులు, అధికారులు కూడా భాగస్వాములైనట్లు తెలిపారు. మొత్తం టెండర్‌ విలువలో 3.2 శాతం కమిషన్‌ తీసుకుంటే.. తన వాటాగా 0.3 శాతం మాత్రమే తీసుకున్నట్టు వీరేంద్ర చెప్పినట్టు తెలుస్తోంది.

వీరేంద్ర కుమార్ రామ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ విస్తృతంగా దర్యాప్తు చేపట్టింది. గ్రామీణాభివృద్ధి శాఖలో భారీస్థాయిలో అవినీతి గురించి గతేడాది మే 9న ఈడీ (రాంచీ విభాగం) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రహస్యంగా ఓ లేఖ రాసింది. కాంట్రాక్టుల నుంచి లంచాలకు సంబంధించి అంశాలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఈడీ అందులో కోరింది. అయితే, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే మంత్రి ఆలంగీర్‌ ఆలం సహా పలు అనుమానితులపై నిఘా పెట్టి సోమవారం అనేక చోట్ల సోదాలు నిర్వహించింది.

ఈ క్రమంలో ఆలం పర్సనల్ సెక్రెటరీ సంజీవ్‌ లాల్‌ పనిమనిషి జహంగీర్‌ నివాసంలో దాడులు చేపట్టడంతో ఈ నోట్ల గుట్టలు బయటపడ్డాయి. పనిమనిషి ఇంట్లో రూ.32 కోట్లు, మరో రెండు చోట్ల రూ.3 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ రాసిన లేఖ కూడా ఈ సోదాల్లో బయటపడటం గమనార్హం. ఈ కేసులో పీఎస్‌ సంజీవ్‌ లాల్‌, పనిమనిషి జహంగీర్‌ను అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే మంత్రి ఆలంగీర్‌ను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T09:39:47Z dg43tfdfdgfd