KCR BUS YATRA : పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం

KCR Bus Yatra From Miryalaguda :  పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఈ క్రమంలోనే రేపటి నుంచి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర చేయనున్నారు. కేసీఆర్ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, ప్రణాళికలు అన్ని సిద్ధం చేశారు. దీంతో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రకు సంబంధించిన బస్సు కు ఈ రోజు తెలంగాణ భవన్ లో ప్రత్యేక పూజలు చేయించారు. ఏప్రిల్ 24 నుంచి 17 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుండగా.. మిర్యాలగూడలో ఈ యాత్ర ప్రారంభం మై మే 10న సిద్దిపేటలో బహిరంగ సభతో యాత్ర ముగియనుంది.                                    

మొత్తంగా 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో 21 చోట్ల రోడ్‌ షోలు నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారైంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్‌ షోతో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభమై.. సిద్దిపేటలో జరిగే సభతో ముగియనుంది. వేసవి తీవ్రత నేపథ్యంలో.. సాయంత్రం 5.30 గంటల తర్వాత ఈ రోడ్‌ షోలను ప్రారంభిస్తారు. రోడ్‌ షో ముగిశాక ఆయా ప్రాంతాల్లో స్థానికంగా రాత్రి బస చేస్తారు.బస్సుయాత్ర సాగే రూట్లలో ఉద యం పూట స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైతుల పంట పొలా లు, కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేసీఆర్‌ సందర్శించనున్నట్టు బీఆర్‌ఎస్‌ తెలిపింది. ఇక బస చేసే ప్రాంతాల్లో విద్యార్థులు, యువత, మహిళలు, మైనారిటీలు, వివిధ సామాజిక వర్గాలతో కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది.                                           

ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్‌ రోడ్‌ షోలు లేవు. అయితే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్‌ పరిసర లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుల రోడ్‌ షోలు ఉంటాయి. 

 

రోడ్‌ షోల షెడ్యూల్‌ :

ఏప్రిల్‌ 24న మిర్యాలగూడ, సూర్యాపేటలలో.. 25న భువనగిరిలో, 26న మహబూబ్‌నగర్‌లో, 27న నాగర్‌కర్నూల్‌లో, 28న వరంగల్‌లో, 29న ఖమ్మంలో, 30న తల్లాడ, కొత్తగూడెంలలో, మే 1న మహబూబాబాద్‌లో, 2న జమ్మికుంటలో, 3న రామగుండంలో, 4న మంచిర్యాలలో, 5న జగిత్యాలలో, 6న నిజామాబాద్‌లో, 7న కామారెడ్డి, మెదక్‌లలో, 8న నర్సాపూర్, పటాన్‌చెరులలో, 9న కరీంనగర్‌లో, 10న సిరిసిల్లలో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. చివరిగా 10వ తేదీనే సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.                                

2024-04-23T10:16:37Z dg43tfdfdgfd