KCR NEWS: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్

KCR on Congress: కేసీఆర్‌ను తిట్టి పబ్బం గడుపుకోవాలనే తప్ప కాంగ్రెస్ నాయకులకు మరే పనీ లేదని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో పంటలు ఎండబెట్టారని.. రైతుబంధు ఎగ్గొట్టారని అన్నారు. రైతుబంధు కూడా ఐదెకరాలు ఉన్నోళ్లకే ఇస్తామని మాట్లాడుతున్నారని అన్నారు. ఏం పోయింది మీ అబ్బసొత్తా? ఇచ్చేందుకు మీకు ఏం బాధైందని కేసీఆర్ విమర్శలు చేశారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు.

‘‘అనాడు నీళ్ల కోసం నిధులు ఉద్యోగాల కోసం ఉద్యమించి తెలంగాణ తెచ్చుకున్నాం. అనాటి నుంచి నేటి వరకు తెలంగాణ బతుకే నీళ్ల కోసం పోరాటం జరిగింది. సాగర్‌లో నీళ్లు ఉండే.. ఇవ్వగలిగే అవకాశం ఉండే. ఈ దద్దమ్మలకు దమ్ములేదు. కాంగ్రెస్ మంత్రులు దద్దమ్మల్లాగా పోయి కేఆర్ఎంబీని కేంద్రానికి అప్పగించారు. అరవై ఏండ్లనుంచి మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామన్నారు. రైతులకు కూడా చెప్పులున్నాయని చెప్పిన. కేసీఆర్ పొంగనే కట్కా బంజేసినట్టు కరెంటు బందయింది.. ఎందుకు? ఎందుకు బాధ పెడుతున్నారూ ప్రజలను. మిగులు కరెంటు మీకు అప్పగించి పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత.. మిషన్ భగీరత ఎందుకు నీళ్లు ఇస్తలేరు.

పంటలెండబెడుతున్నారు.. రైతు బంధు ఎగ్గొట్టినారు.. దేశంలో లేని విధంగా రైతుకు పంట పెట్టుబడి అందించాం. నేను వస్తుంటే దారిలో రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. 20 రోజులనుంచి వడ్లు కొంటాలేరని గోస పడుతున్నారు. కల్యాణలక్ష్మికి తులం బంగారం ఇస్తామన్నారు వచ్చిందా ఎవరికన్నా..? లగెత్తండి పరిగెత్తండి రెండు లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు రద్దు చేస్తామన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు. ఇవ్వాళ మేం అనలేదు అని అబద్దాలాడుతుండ్రు. 

కేసీఆర్ అనవాళ్ళ లేకుండా జేస్తారా? నేను కట్టిన సెక్రటేరియట్, యాదాద్రి, పోలీస్ కంట్రోల్ రూం అన్నీ కూలగొడతరా? మీరు నన్ను జైల్లో పెడతారా? మీ మాటలకు బెదిరేదిలేదు. పదిహేను ఏండ్లు పోరాటం చేసి సాధించి..పదేండ్లు అభివృద్ధి చేసిన నన్ను పట్టుకుని పేగులు తీస్తాం మెదలేసుకుంటాం అంటారా? ఒక సీఎం ఇట్లా మాట్లాడొచ్చునా? అంబేద్కర్ పుణ్యమా అని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ వచ్చింది. వారిని స్మరించుకునే సోయిలేదు ఈ ప్రభుత్వానికి. హామీలు ఎగ్గొట్టి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలకు పంచాతీ పడ్డది. మన హక్కులను కాపాడుకోవాలంటే.. మన తరఫున కొట్లాడడానికి మనకో పంచాతీ పెద్ద కావాలి. మనకు పంచాతీ పెద్ద ఎవరు?

బీఆర్ఎస్ బలమే తెలంగాణ ప్రజల బలం. రాబోయే లోకసభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించండి. మీ తరఫున కొట్లాడి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి భూమ్యాకాశాలు ఏకం చేసైనా కాంగ్రెస్ హామీలను మెడలు వంచి అమలు చేయిస్తా’’ అని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.

2024-04-24T15:36:49Z dg43tfdfdgfd