KEJRIWAL ARREST: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా జోక్యం దేనికి సంకేతం? ఇది ఎన్నికల్ని ప్రభావితం చేసే ఎత్తుగడా?

Arvind Kejriwal Arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదొక్కటే చర్చ. మామూలు రోజుల్లో అయితే ఈ స్థాయి (Delhi Liquour Policy) అలజడి ఉండేది కాదేమో. కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో మొత్తంగా దేశ రాజకీయాల్ని మార్చేసింది ఈ స్కామ్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌తో (Arvind Kejriwal Arrest) మొత్తం పొలిటికల్ పిక్చర్‌ మారిపోయింది. కావాలనే ప్రతిపక్షాలను టార్గెట్ చేసి దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పుతున్నారని విమర్శిస్తున్నా...చట్ట ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని తేల్చి చెబుతోంది బీజేపీ. ఇందులో రాజకీయ కుట్ర కోణం ఉందా లేదా అన్నది పక్కన పెడితే...కచ్చితంగా కుంభకోణం అయితే జరిగింది అని చాలా స్పష్టంగా చెబుతోంది ఈడీ. కేజ్రీవాల్ అరెస్ట్ తరవాత మరి కొన్ని కీలక విషయాలూ బయట పెట్టింది. అసలు ఈ స్కామ్‌కి ఆయనే సూత్రధారి అని కూడా కోర్టుకి వెల్లడించింది. ఇది పొలిటికల్ హీట్‌ని ఇంకాస్త పెంచింది.

భారత్‌లో ఇది ఈ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది అంటే పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కానీ...ఈ కేజ్రీవాల్ అరెస్ట్ అంశం అంతర్జాతీయంగానూ అలజడి రేపుతోంది. ముందు జర్మనీ, ఆ తరవాత అమెరికా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి. ఇలా వరుసగా కేజ్రీవాల్ అరెస్ట్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోవడమే ఇందుకు కారణం. సాధారణంగానే భారత్‌ తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే గట్టిగానే బదులు చెబుతుంది. ఇప్పుడూ అదే చేసింది. పారదర్శకంగా విచారణ చేపట్టాలంటూ జర్మనీ, అమెరికా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చింది. "ప్రజాస్వామ్య దేశం మాది. ఇక్కడ అన్నీ చట్ట ప్రకారమే జరుగుతాయి" అని తేల్చి చెప్పింది. ఇంకెప్పుడూ ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చొద్దు అంటూ సున్నితంగానే మందలించింది. 

ఎందుకీ వ్యాఖ్యలు..?

కేజ్రీవాల్ అరెస్ట్‌ గురించి అమెరికాకి ఎందుకు..? ఐక్యరాజ్యసమితి ఎందుకు మాట్లాడుతోంది..? నిజమే. అసలు అమెరికాకి ఇక్కడి స్థానిక వ్యవహారంపై అంత ఆసక్తి దేనికి అనేదే అసలు ప్రశ్న. ఇందుకు చాలా కారణాలు ఉండొచ్చు. అందులో కొన్ని అంచనా వేస్తే...అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కీలక నేత. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అరెస్ట్ అవడం సంచలనమే. పైగా పదవిలో ఉండగానే జైలు పాలవ్వడం మరింత అలజడి రేపింది. అంతే కాదు. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అవడం ఇంకాస్త చర్చకు దారి తీసింది. ఇదొక కారణమైతే...లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) ముందు ఈ పరిణామం జరగడం వల్ల కచ్చితంగా కుట్ర కోణం ఉందన్న వాదనలు వినిపించడం మరో కారణం. భారత్‌ లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే కచ్చితంగా మిగతా దేశాలు గమనిస్తుంటాయి. కాకపోతే...వాటి పరిధి దాటి వ్యాఖ్యలు చేయడమే ఇక్కడ ఇబ్బంది పెట్టిన విషయం.

ఇదొక్కటే కాదు. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ (Congress Bank Accounts) చేయడమూ మరో వివాదానికి దారి తీసింది. భారత ప్రభుత్వం ప్రతిపక్షాల్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శల్ని ఆధారంగా చేసుకుని అమెరికా ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అటు జర్మనీ కూడా ఇంతే. కేవలం ప్రతిపక్షాల ఆరోపణల్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు దేశాలు స్పందించి ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. కానీ ఎన్నికల ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో మరింకేదైనా రాజకీయ ఉద్దేశం ఉందా అన్నది మరో ప్రశ్న. భారత్‌తో మైత్రి కొనసాగిస్తున్న అగ్రరాజ్యం ఇలా స్పందించడమే షాక్‌కి గురి చేసింది. ఈ వ్యాఖ్యల్ని కేవలం ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయంగానే తీసుకోవాలని కొందరు చెబుతున్నా భారత్ మాత్రం వీటిని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది.

అమెరికా ఎన్నికలతో లింక్స్..?

2016,2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections) ఎంత ఆసక్తి కలిగించాయో అంతే స్థాయిలో వివాదాలకూ కేంద్రబిందువయ్యాయి. అందుకు ముఖ్య కారణం...ఈ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు రావడం. అమెరికా స్పెషల్ కౌన్సిల్ రిపోర్ట్ ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. జో బైడెన్‌కి వ్యతిరేకంగా, ట్రంప్‌కి మద్దతుగా రష్యా ప్రచారం చేసిందని వెల్లడించింది. యూఎస్ ఇంటిలిజెన్స్ కూడా రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. కొంత మంది గూఢచారులతో బైడెన్‌కి వ్యతిరేక ప్రచారం చేయించిందని, సోషల్ మీడియానీ ప్రభావితం చేసిందని వివరించింది. అందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సహకరించారని స్పష్టం చేసింది. కొంత మంది రష్యన్ నటీ నటులు అమెరికా ప్రజల్లో బైడెన్‌పై విశ్వాసం పెరగకుండా వ్యతిరేక ప్రచారం చేశారని, కొంత మందిని ప్రభావితం చేశారని గతేడాది అమెరికా ఇంటిలిజెన్స్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలు అప్పట్లో పెను సంచలనమయ్యాయి. ఈ ఏడాది నవంబర్‌లోనూ అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కూడా రష్యా ఇలాంటి కుట్ర చేసేందుకు సిద్ధమవుతోందంటూ కొందరు వాదిస్తున్నారు. కానీ...రష్యా ఇటీవల ఓ కీలక ప్రకటన చేసింది. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోబోం అని వెల్లడించింది. పైకి ఈ ప్రకటన చేసినప్పటికీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న వివాదం మాత్రం గట్టిగానే రాజుకుంటోంది. 2020 ఎన్నికల్లో మోసం చేసి గెలిచారంటూ ఇప్పటికే ట్రంప్ చాలా సార్లు విమర్శలు చేశారు. దీన్ని డెమొక్రాట్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

భారత్‌ విషయంలో అమెరికా ఇదే చేస్తోందా..?

ఇప్పుడిదంతా చెప్పుకోడానికి ప్రధాన కారణం...సరిగ్గా ఎన్నికల ముందు ప్రజల్ని ప్రభావితం చేయడానికి రష్యా కుట్ర చేసిందని ఆరోపించిన అమెరికాయే...ఇప్పుడు భారత్‌లోని అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకుంటోంది. ఇక్కడా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా ఇలాంటి వ్యాఖ్యల్ని కూడా కుట్రగానే భావించాలా..అన్న బలమైన వాదన గట్టిగానే వినిపిస్తోంది. రష్యాని అంతగా తిట్టిపోసిన అమెరికా..భారత్ విషయంలో అదే చేస్తోందిగా అని కొందరు మండి పడుతున్నారు. ఇక ఐక్యరాజ్య సమితి (UN on Kejriwal Arrest) కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ఆశ్చర్యం కలిగించిన విషయం. ఐక్యరాజ్య సమతి భద్రతా మండలిలో సంస్కరణలు చేయాల్సిన అవసరాన్ని భారత్ పదేపదే గుర్తు చేస్తోంది. పాతకాలం నాటి నియమ నిబంధనల్ని పక్కన పెట్టాలని సూచించింది. మండలిలో శాశ్వత సభ్యత్వం పొందే హక్కు తమకు ఉందని తేల్చి చెబుతోంది. కానీ...దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల జరిగిన G20 సమావేశాల్లోనూ భారత్ ఇదే డిమాండ్ వినిపించింది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి కూడా కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించడం, హక్కులు కాపాడాలని చెప్పడం అలజడి రేపింది. 

2024-03-29T13:11:56Z dg43tfdfdgfd