LOK SABHA ELECTIONS: మూడో విడతలో ఓటేసిన మోదీ, షా, ఖర్గే, కేంద్రమంత్రులు, మాజీ సీఎంలు

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ నియోజకవర్గాల్లో మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడో దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పలువురు కేంద్రమంత్రులు, సీఎంలు, మాజీ సీఎంలు, గవర్నర్లు.. పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే గాంధీనగర్ పరిధిలోని అహ్మదాబాద్‌లోని నిషాన్ హైస్కూల్‌కు వెళ్లిన ప్రధానమంత్రి.. ఓటు వేశారు.

ఇక కేంద్రమంత్రి, గాంధీ నగర్ లోక్‌సభ నియోజవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అమిత్ షా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ బూత్‌కు వెళ్లిన అమిత్ షా.. తన ఓటు వేశారు. భార్య సోనాల్ షా.. అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షాలతో అహ్మదాబాద్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కర్ణాటకలో ఓటు వేశారు. ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌.. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌.. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి.. విదిశ నుంచి బీజేపీ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కేంద్రమంత్రులు మన్‌సుఖ్‌ మాండవీయ, ప్రహ్లాద్‌ జోషి, జ్యోతిరాదిత్య సింధియా ఓటు వేశారు.

బారామతి ఎంపీ అభ్యర్థులు సుప్రియా సూలే, సునేత్ర పవార్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పలు కూడా తమ పరిధిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. గుజరాత్ జామ్‌నగర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా పండిట్ దీనదయాళ్ విద్యా భవన్‌లో ఓటు వేశారు. సినీ నటి జెనీలియా.. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఓటు వేశారు. జెనీలియాతో పాటు ఆమె భర్త దేశ్‌ముఖ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T10:44:49Z dg43tfdfdgfd