LOK SABHA ELECTIONS: రెండో విడత ఎన్నికల్లో ప్రముఖులు.. బరిలో రాహుల్ గాంధీ, హేమ మాలిని, శశిథరూర్, ఓం బిర్లా

Lok Sabha Elections: దేశంలో లోక్‌సభ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 7 దశల్లో పోలింగ్ జరగనుండగా.. ఇప్పటికే ఒక దశ ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో దశ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. 13 రాష్ట్రాల్లోని 89 నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. కేరళలోని మొత్తం 20 స్థానాలతోపాటు.. కర్ణాటకలో14 సీట్లు, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర 8, ఉత్తరప్రదేశ్‌ 8, మధ్యప్రదేశ్‌లో 7, అస్సాం 5, బీహార్‌ 5, ఛత్తీస్‌గఢ్ 3, పశ్చిమ బెంగాల్‌ 3, త్రిపుర, జమ్మూ కాశ్మీర్‌లలో ఒక్కో నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఇక రెండో దశలో పలువురు కీలక నేతలు వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో కూడా రేపే ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇదే నియోజకవర్గంలో బీజేపీ నుంచి సురేంద్రన్.. సీపీఐ తరఫున అన్నీరాజా బరిలోకి నిలిచారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి పోటీ చేస్తుండగా.. అదే స్థానంలో కాంగ్రెస్ నుంచి శశిథరూర్ బరిలో ఉన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోటా స్థానం నుంచి బరిలో నిలిచారు. జోధ్‌‌పూర్ నుంచి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మథుర నియోజకవర్గం నుంచి నటి హేమ మాలిని.. మీరట్ నుంచి టీవీ నటుడు, రామాయణం సీరియల్‌లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్‌ పోటీలో నిలిచారు.

బెంగళూర్ సౌత్ నుంచి బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ తేజస్వీ సూర్య పోటీలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి సౌమ్యారెడ్డి బరిలో నిలిచారు. ఇక ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ బీజేపీ కంచుకోట రాజ్‌నంద్‌గావ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ స్థానంలో బీజేపీ నేత సంతోష్ పాండే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్ అలప్పుజ స్థానంలో పోటీ చేస్తున్నారు. త్రిస్సూర్ నుంచి బీజేపీ నేత, మళయాళ నటుడు సురేష్ గోపి బరిలో నిలిచారు. ఇదే త్రిస్సూర్‌లో కాంగ్రెస్ నుంచి కె మురళీధరన్‌.. సీపీఎం తరఫున వీఎస్ సునీల్‌ కుమార్‌ పోటీ చేస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-25T14:39:08Z dg43tfdfdgfd