ONION EXPORTS: ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం.. ఉల్లి ఎగుమతులపై కీలక ప్రకటన..

Onion Export Duty: భారత్‌లో ఉల్లి ధరల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో విధించిన ఆంక్షల్ని తాజాగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని నెలలుగా ఇది అమల్లో ఉండగా.. తాజాగా ఆ నిషేధం ఎత్తివేసింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శనివారం రోజు దీని గురించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇవి కొనసాగుతాయని పేర్కొంది. ఇక కనీస ఎగుమతి ధరను టన్నుకు 550 డాలర్లుగా భారత కరెన్సీలో ఇది రూ. 45,860 గా ఉన్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలో తదుపరి దశ పోలింగ్ జరగనున్న సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

దేశంలో ఉల్లి దిగుబడి ఆశించిన స్థాయి మేరకు ఉండబోదన్న అంచనాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం.. కిందటేడాది చర్యలకు పూనుకుంది. దేశీయంగా ధరల్ని అదుపులో ఉంచేందుకు.. మొదటగా ఉల్లి ఎగుమతులపై కనీస ధరను టన్నుపై 800 డాలర్లకు పెంచుతూ అక్టోబర్ 28న నిర్ణయం తీసుకుంది.

కొంత కాలానికే డిసెంబర్ 8న దీనిపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ ఆదేశాలు మార్చి 31 వరకు అమలవుతాయని పేర్కొనగా.. తర్వాత మళ్లీ ఆ గడువును పొడిగించింది. ఉల్లి ఎగుమతులపై శుక్రవారం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించిన కేంద్రం వెంటనే శనివారం రోజు ఆంక్షల్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

>> ఉల్లి ఎగుమతులపై నిషేధం పట్ల మహారాష్ట్రలోని ఉల్లి రైతుల నుంచి ఎప్పటినుంచో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నిషేధం వల్ల తమకు ఆశించిన మేరకు రాబడ రావట్లేదన్నది వారి వాదన. ఈ క్రమంలోనే ఆంక్షలు ఎత్తేయాలని పలు మార్లు ఆందోళనలకు దిగారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా.. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఉల్లి రైతుల్ని నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించింది. ఈ కేంద్ర నిర్ణయంపై ట్రేడర్స్ కూడా గుర్రుగానే ఉన్నారు. మహారాష్ట్రలో ఇంకా పలు విడతల్లో మరికొన్ని స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే ఇలా కేంద్రం ఉల్లి ఎగుమతులపైన ఆంక్షలు ఎత్తేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T10:52:12Z dg43tfdfdgfd