PHONE TAPPING CASE: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం - మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Two More Persons in Police Custody in Phone Tapping Issue: రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో (Phone Tapping Case) గురువారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, గట్టు మల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. గతంలో ఎస్ఐబీ సీఐగా పనిచేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో వీరికి ఉన్న సంబంధంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. 

ఇప్పటికే ముగ్గురి అరెస్ట్

ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. గతంలో ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసి వారి వ్యక్తిగత విషయాలపై నిఘా పెట్టి, ప్రభుత్వం మారిన తర్వాత వీరు ఆ హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారని ఆరోపణలున్నాయి. ప్రణీత్ రావును విచారించిన అధికారులు.. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అటు, భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. దీనిపై న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది.

ఇటీవలే ప్రధాన సూత్రధారి ఫోన్

కాగా, ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తాజాగా ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ సందర్భంగా తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని.. జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్ కు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. 'ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు ఎలా పని చేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్తే మేం కూడా అలాగే చేశాం.' అని సదరు ఉన్నతాధికారితో అన్నట్లు సమాచారం. అంతే కాకుండా, ఎంతైనా మన పోలీసులం ఒకటని.. మా ఇళ్లల్లో సోదాలు ఎందుకు చేస్తున్నారని కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే, ప్రభాకర్ రావు ఫోన్ కు స్పందించిన ఉన్నతాధికారి.. 'మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే అధికారిక మెయిల్ కు  సమాధానం రాసి పంపించండి.' అని స్పష్టం చేశారట. దీంతో ప్రభాకర్ రావు ఏమీ మాట్లాడకుండానే ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది.

అయితే, తొలుత ఎస్ఐబీ ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన ప్రణీత్ రావును విచారిస్తుండగా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగుచూడడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్ లకు పాల్పడినట్లు గుర్తించారు. వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకు భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. 

Also Read: Sangareddy News: సంగారెడ్డి జిల్లాలో పెళ్లి ట్రాక్టర్ బోల్తా- ముగ్గురు మృతి- వివాహం ఆగిపోవడంతో వరుడి తాత ఆత్మహత్య

2024-03-28T10:06:26Z dg43tfdfdgfd