PM MODI : యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫ‌లితాల్లో ఫెయిలైన అభ్య‌ర్థులకు ప్ర‌ధాని మోదీ ఉద్భోద.. ఇది ముగింపు కాదు..

PM Modi - UPSC Civil Services Exam 2023 : రెండు రోజుల క్రితం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ 2023 పరీక్ష తుది ఫలితాలు (UPSC Results 2024) విడుదలైన విష‌యం తెలిసిందే. మొత్తంగా 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో ఐఏఎస్‌కు 180, ఐఎఫ్‌ఎస్‌కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. తాజాగా ర్యాంకర్లకు సంబంధించిన మార్కుల జాబితాను కూడా విడుదల చేశారు. మొదటి ర్యాంకర్‌ ఆదిత్య శ్రీవాస్తవకు మొత్తం 2025 మార్కులకు గాను 1099 మార్కులు వచ్చాయి. అలాగే.. రెండో ర్యాంకర్‌ అనిమేష్‌ ప్రధాన్‌కు 1067 మార్కులు, మూడో ర్యాంకర్‌ మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్యరెడ్డికి 1065 మార్కులు వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక.. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు వందలోపు ర్యాంకులు, 11 మంది 200లోపు ర్యాంకులు పొందారు. లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ పరీక్షలో తొలి స్థానంలో నిలిచారు. అలాగే.. మొత్తం 1,016 మంది విజయం సాధించగా వారిలో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 30 మంది దివ్యాంగులు ఉండడం విశేషం. అలాగే.. ఈ ఫలితాల్లో ఆరుగురు అమ్మాయిలు టాప్‌-10లో నిలిచి సత్తా చాటారు. ఈ ఫ‌లితాల్లో విజ‌యం సాధించిన అంద‌రిని భార‌త్ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ అభినందించారు. అలాగే వారి కృషి, ప‌ట్టుద‌ల‌, అంకిత‌భావం ఫ‌లించాయ‌ని స్పష్టం చేశారు. అలాగే వీరికి ప్ర‌జాసేవ‌లో ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్తుకి ఇది తొలిమెట్టుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. రానున్న రోజుల్లో వారి ప్ర‌య‌త్నాలు దేశ భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దుతాయ‌ని ఆయ‌న అన్నారు.

ఇది ముగింపు కాదు..

యూపీఎస్సీ సివిల్స్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల్లో తాము అనుకున్న విజ‌యాన్ని సాధించ‌లేక పోయిన అభ్య‌ర్థులకు.. ఇది వారి ప్ర‌యాణంలో ముగింపుకాద‌నే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించ‌డానికి ఎన్నో మార్గాలున్నాయ‌ని ప్ర‌ధాని మోడీ అభిప్రాయపడ్డారు. వీరి ప్ర‌తిభ‌ను స‌రిప‌డా ఉప‌యోగించుకునేందుకు భార‌త‌దేశంలో పుష్క‌లంగా అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. అలాగే వీరు ప్ర‌యత్నాలు చేస్తూ.. మ‌రిన్ని అవ‌కాశాల‌ను అన్వేషించాల‌ని ప్ర‌ధాని మోదీ ఆకాంక్షించారు.

యూపీఎస్సీ 2023 నోటిఫికేషన్‌ ద్వారా 1105 వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాలు భర్తీ చేయ‌నున్నారు. గతేడాది మే 28న జరిగిన సివిల్స్‌-2023 ప్రాథమిక పరీక్షకు మొత్తం 10,16,850 నమోదు చేసుకోగా.. 5,92,141 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 14,624 మంది మెయిన్స్‌కు, 2,855 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. తుది దశలో 1,016 మంది సివిల్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-19T12:07:39Z dg43tfdfdgfd