RAILWAY STAFF RESCUE: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్.. ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న బాలుడిని కాపాడిన టీసీ

Railway Staff rescue: Inter పరీక్షల్లో ఫెయిలయ్యాననే Exams Fail మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన బాలుడిని రైల్వే TTE కాపాడారు. ఆత్మహత్య ఆలోచనతో ఇంటి నుంచి పారిపోయిన మైనర్ బాలుడిని రక్షించారు.

రైలు నెం. 17210 కాకినాడ టౌన్-బెంగళూరు రాజమండ్రి రైలులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిర్యాదు అందగానే రైల్వే సిబ్బంది వేగంగా స్పందించడంతో బాలుడిని సురక్షితంగా కాపాడారు. ఏప్రిల్ 17వ తేదీన జరిగిన ఘటనలో రైల్వే ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (TTE) చొరవతో ఈ ఆపరేషన్ ముగిసింది.

కాకినాడ టౌన్‌లో నివాసం ఉంటున్న 17 ఏళ్ల మైనర్ బాలుడు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ కావడంతో బుధవారం సాయంత్రం 16.30 గంటల సమయంలో తల్లిదండ్రులను చనిపోతానని బెదిరిస్తూ ఇంటి నుంచి పారిపోయాడు.

కొడుకు ఇంటి నుండి పారిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కాకినాడలోని రైల్వే స్టేషన్ & బస్టాండ్‌లో అతని ఆచూకీ గురించి ఆరా తీశారు. బాలుడిని రైలు నెం. 17210 కాకినాడ టౌన్- బెంగళూరు - కాకినాడ టౌన్ రైలు ఎక్కినట్టు రైల్వే పోర్టర్లు సమాచారం ఇచ్చారు. బాలుడి ఫోటోను రైల్వే పోర్టర్లు గుర్తించి బాధిత తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లైసెన్స్ పోర్టర్ నుండి సమాచారం అందుకున్న తర్వాత, బాలుడి తండ్రి ఉస్మాన్ రాజమండ్రిలో నివసిస్తున్న తన సోదరుడికి సమాచారం ఇచ్చారు.

బాలుడి బంధువులు రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకుని బాలుడి ఫోటోతో ఆరా తీయడం ప్రారంభించారు. రాజమండ్రి స్టేషన్‌లోని చీఫ్ టికెటింగ్ ఇన్‌స్పెక్టర్ S S చంద్రమౌళికి ఫిర్యాదు చేయడంతో ఆయన వేగంగా స్పందించారు. టిక్కెట్ చెకింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న బాలుడిని గుర్తించాలని మిగిలిన టిక్కెట్ చెకింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిటిఐ చంద్రమౌళితో సూచనలతో రైల్లో ఉన్న ఎస్కార్ట్ RPF, GRP సిబ్బంది రైల్లో తనిఖీలు ప్రారంభించారు. రాజమండ్రి స్టేషన్ RPF సిబ్బందికి సమాచారం అందించి బాలుడి ఫోటోను వారికి పంపారు.

సాయంత్రం 6.43 గంటలకు, రైలు రాజమండ్రి రైల్వే స్టేషన్‌‌కు వచ్చింది. ప్లాట్‌ఫారమ్‌‌పైకి రాగానే టిసి సిబ్బంది, రైల్వే పోలీసులు రైలు రెండు చివర్లలోని జనరల్ కోచ్‌లను తనిఖీ చేయడం ప్రారంభించారు. సిటిఐ చంద్రమౌళి S-11 కోచ్‌లో ఫుట్ బోర్డ్‌పై కూర్చున్న బాలుడిని గుర్తించారు. రైలు ఆగిన వెంటనే బోగీలోకి వెళ్లి బాలుడి ఆచూకీ గురించి ఆరా తీశారు. అతనితో మాట్లాడుతూ మెల్లగా రైలు నుంచి కిందకు దింపి రైల్వే స్టేషన్‌లోని టీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ వేచి చూస్తున్న బంధువులు బాలుడిని గుర్తించారు.

విచారణలో బాలుడు పరీక్షల్లో ఫెయిలైనందుకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి నుండి పారిపోయానని వివరించాడు. టిక్కెట్ చెకింగ్ సిబ్బంది, జీఆర్‌పీలు బాలుడికి కౌన్సెలింగ్‌ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు.తమ కుమారుడి ప్రాణాలను కాపాడినందుకు బాలుడి తల్లిదండ్రులు రైల్వే సిబ్బంది, ఆర్పీఎఫ్ జిఆర్పీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

మైనర్ బాలుడిని రక్షించినందుకు రాజమండ్రి టికెట్ చెకింగ్ సిబ్బందిని విజయవాడ సీనియర్ డిసిఎం వావిలపల్లి రాంబాబు అభినందించారు. రాజమండ్రి సిటిఐ చంద్రమౌళిని విజయవాడ డిఆర్‌ఎం నరేంద్ర పాటిల్ అభినందించారు. ప్రయాణికుల భద్రతతో పాటు మైనర్లు, బాలల సంరక్షణలో రైల్వే సిబ్బంది క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు.

2024-04-19T00:28:12Z dg43tfdfdgfd