RYTHU BHAROSA : రైతులకు షాక్.. రైతు భరోసా సాయం నిలిపివేయాలని ఆదేశాలు..

తెలంగాణలో రైతు భరోసా (రైతుబంధు) పథకాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఆంక్షలు విధించింది. మే 13న పోలింగ్ పూర్తయిన తర్వాతే రైతు భరోసా సాయం పంపిణీని తిరిగి ప్రారంభించాలని తెలిపింది. దీంతో తెలంగాణలో దాదాపు 4 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం మరింత ఆలస్యం కానుంది.

ఈనెల 4న కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని రైతు భరోసా పథకం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 69 లక్షల మంది రైతులు ఉన్నారని, వీరిలో 65 లక్షల మంది రైతులకు ఇప్పటికే రైతు భరోసా సాయం అందినట్లు వెల్లడించారు. మిగతా రైతులకు కూడా మే 8వ తేదీ నాటికి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ కూడా విసిరారు.

అయితే ఎన్నికల ప్రచారంలో రైతు భరోసా పథకాన్ని ప్రస్తావించడంపై ఎన్ వేణు కుమార్ అనే వ్యక్తి మే 6న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈసీ చర్యలు చేపట్టింది. మే 13 న తెలంగాణలో పోలింగ్ ముగిసే వరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వ రైతు భరోసా సాయం విడుదలను ప్రారంభించిన 3 నెలలు దాటింది. అయితే 5 ఎకరాలకు పైగా భూమి రైతులకు ఇంకా సాయం అందలేదు. వీరికి సోమవారం నుంచే సాయం విడుదలను ప్రభుత్వం ప్రారంభించింది. కానీ ఆ మరునాడే ఎన్నికల సంఘం ఆంక్షలు విధిచండంతో నగదు బదిలీ ప్రక్రియ నిలిచిపోయింది. పంట పెట్టుబడి సాయం కోసం రైతులు ఇంకో వారం రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

కాగా, వానా కాలం సీజన్ నుంచి రైతు భరోసా సాయాన్ని ఎకరానికి రూ. 15 వేలకు పెంచనుంది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ సాయాన్ని అందించనుంది. అలాగే రూ. 2 లక్షల రుణమాఫీని కూడా ఆగస్టు 15 నాటికి అమలు చేస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఒకే విడతలో రుణమాఫీ జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వ కచ్చితంగా అమలు చేస్తుందని తేల్చి చెప్పారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రైతుబంధు పథకంపై వివాదం తలెత్తింది. మాజీ మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో రైతుబంధు పథకం గురించి ప్రస్తావించడంతో కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం రైతు బంధు సాయాన్ని ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈసీ నిలిపివేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కు కూడా అదే పరిస్థితి వచ్చింది.

2024-05-07T12:08:24Z dg43tfdfdgfd