SAMSHABAD LEOPARD: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌‌ బోనులో చిక్కిన చిరుత, వారం రోజులుగా ముప్పతిప్పలు పెట్టిన చిరుత

Samshabad Leopard: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. గత వారం రోజులుగా చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ విశ్వప్రయత్నాలు చేస్తోంది. గత వారం చిరుతను గుర్తించిన విమానాశ్రయ సిబ్బంది అటవీశాఖకు సమాచారం ఇచ్చారు.

చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు చేసినా వాటికి చిక్కకుండా తిరుగుతోంది. రెండ్రోజుల క్రితం ఏకంగా రన్ వేపై ప్రత్యక్షమైంది. చిరుత పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఓ దశలో చిరుత బోనులో చిక్కకపోవడంతో దానిని మత్తు మందు ఇచ్చి బంధించాలని భావించారు.

సీఐఎస్ఎఫ్ అధికారులు కూడా చిరుత ఎయిర్‌పోర్ట్‌లోకి రాకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేకు సమీపంలో గత ఆదివారం చిరుత కలకలం సృష్టంచింది. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టు పెట్రోలింగ్ సిబ్బంది రన్ వే పై చిరుతను గుర్తించారు. చిరుతను పట్టుకునేందుకు వెంటనే ఆపరేషన్ చేపట్టారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిరుత సంచరిస్తుందనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టు పెట్రోలింగ్ సిబ్బంది మొదట చిరుతను గుర్తించారు.

రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ రన్ వే పై చిరుత దర్శనం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు, వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఆపరేషన్ చిరుత చేపట్టారు. ఆహారాన్ని వెదక్కుంటూ చిరుత ఎయిర్‌ పోర్ట్ ప్రహారీ దాటి లోపలకు వస్తున్నట్టు గుర్తించారు. దీంతో రన్ వే పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నారు.

ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్(Shamshabad) పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ప్రహరీ గోడను దూకి ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి ప్రవేశించింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు గుర్తించారు.

చిరుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడను దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లు తగలడంతో కంట్రోల్ రూమ్ లో అలారం మోగింది. దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టు సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుతతో పాటు రెండు కూనలు ఉన్నట్లు ఎయిర్ పోర్టు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చేపట్టారు. వారం రోజులుగా రాత్రి సమయాల్లో ఎయిర్‌ పోర్ట్‌లోకి వస్తున్న చిరుత వచ్చిన మార్గంలోనే బయటకు వెళ్లిపోతోంది. చిరుతను బంధించేందుకు పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసి అందులో ఎరలు ఉంచారు.

బోనులో ఉంచిన మేక మాంసాన్ని తీసుకెళ్లిన చిరుత అందులో చిక్కలేదు. దీంతో మత్తు ప్రయోగించాలని భావించారు. చిరుత కదలికలను తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు, బోన్ లు ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఒకసారి శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుత కలకలం రేపింది. తాజాగా ఇప్పుడు మరోసారి చిరుత సంచారాన్ని గుర్తించారు. ఎట్టకేలకు అధికారుల ప్రయత్నాలు ఫలించి శుక్రవారం రాత్రి బోనులో చిక్కినట్టు ప్రకటించారు. వైద్య పరీక్షల తర్వాత చిరుతను సురక్షిత ప్రాంతంలో విడిచి పెట్టనున్నారు. చిరుత కూనల కోసం గాలింపు చేపట్టారు.

2024-05-03T04:11:56Z dg43tfdfdgfd