TELANGANA: తెలంగాణలో రికార్డులో ఎండలు.. ఆరెంజ్ హెచ్చరికల జారీ..!

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. గత రెండు రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.  ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతు న్నాయి. బుధవారం పగటి ఉష్ణోగ్రతలు నిప్పుల కుంపటిని తలపించాయి. మార్చి నెలలోనే భానుడి ప్రతాపానికి జనం బేజారవుతున్నారు. మున్ముందు ఎండల తీవ్రత ఇంకా ఎలా ఉంటుందోనని జనం ఇంకా భయపడిపోతున్నారు.

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, సాత్నాల, బేల మండలం చప్రాలలో బుధవారం 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం రాష్ట్రంలోనే రికార్డుగా చెప్పవచ్చు. ఆసిఫాబాద్లో 42.1, కొండాపూర్, అర్లిటిలో 41.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గాలిలో తేమశాతం గణనీయంగా తగ్గడం వల్ల వేడిగాలుల సెగలకు జనం అల్లాడిపోతున్నారు. ఉదయం తొమ్మిది గంటలు దాటితే పగలు మూడు గంటల వరకు ఎండలు మండుతుండటంతో నిప్పుల కుంపటిని తలపిస్తోంది. పల్లెల్లో ఉపాధి కూలీలు, ఏజెన్సీ గిరిజనులు బయటకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్ బొగ్గు గనుల ప్రాంతాల్లో సైతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉట్నూర్, ఇంద్రవెల్లి, కెరమెరి, బోథ్, తాంసి మండలాల్లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.

రానున్న మూడు రోజులు కూడా సాధారణం కంటే మరో మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎండల పెరుగుదల దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించిది.  మరోవైపు ఎండల తీవ్రత నేపథ్యంలో పట్టపగలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, పట్టణ కేంద్రాలు జనం లేక నిర్మానుష్యంగా మారాయి. భగభగ మండుతున్న ఎండలకు వీధివ్యాపారులు, కూరగాయలు అమ్మే రైతులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

2024-03-28T01:27:54Z dg43tfdfdgfd