NOIDA TRAFFIC JAM: నడిరోడ్డుపై ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు

Traffic Jam: రోడ్లపై ప్రయాణించేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎప్పుడు ఎటు వైపు నుంచి ఏ రకంగా ప్రవర్తిస్తారో ఊహించడం కష్టం. గత వారం తనకు జరిగిన ఓ భయంకర సంఘటన గురించి ఓ మహిళ తాజాగా వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని నోయిడాకు చెందిన ఓ మహిళ.. తనకు ఎదురైన ఊహించని సంఘటన గురించి తెలిపారు. తాను ఒంటరిగా కారులో ఆఫీస్‌కు వెళ్తుండగా.. ఇద్దరు దుండగులు వచ్చి తనను పూర్తిగా ఏమార్చి.. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఎత్తుకుపోయారని పేర్కొన్నారు. పట్టపగలే రద్దీగా ఉండే రోడ్డుపై.. అది కూడా దేశ రాజధాని పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకోవడం తీవ్ర సంచలనంగా మారింది.

నోయిడాకు చెందిన వాంఛా గార్గ్ అనే మహిళ.. పర్థాలా చౌక్ సమీపంలో తన కారులో వెళ్తుండగా.. ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. మే 2 వ తేదీన ఉదయం 10 గంటలకు ట్రాఫిక్‌లో చిక్కుకున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి తన కారు అద్దాలను కొట్టినట్లు తెలిపారు. ఆ వెంటనే మరో వ్యక్తి మరో వైపు నుంచి వచ్చి కారు అద్దాలు కిందికి దించాలని సూచించినట్లు వాంఛా గార్గ్ పేర్కొన్నారు. తన కారు ఓ చిన్నారిని ఢీకొట్టిందని.. కారు వెనక టైరు ఆ చిన్నారిపైకి ఎక్కిందని అరిచినట్లు తెలిపారు. దీంతో తాను ఒక్కసారిగా భయపడిపోయానని.. కానీ తన కారు ఎవరినీ ఢీకొట్టినట్లు తనకు అనిపించలేదని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన కారు అద్దాన్ని కిందికి తీయమని బలవంతం చేశాడని పేర్కొన్నారు. కొద్దిగా అద్దం కిందికి దించగానే.. కారు డోరు తీసేందుకు ప్రయత్నించగా మళ్లీ అద్దాన్ని పైకి అన్నట్లు తెలిపారు. అప్పుడు అతని చేయి ఆ అద్దంలో ఇరుక్కుపోవడంతో నొప్పితో బతిమాలాడగా.. తిరిగి కిందికి అన్నట్లు చెప్పారు. ఈసారి బలంగా ఆ వ్యక్తి చేయి లోపలికి పెట్టి.. కారు డోరును తీసినట్లు తెలిపారు. ఇక మరో వైపు నుంచి ఇంకో వ్యక్తి కారు అద్దాన్ని కొడుతూ తీవ్ర భయాందోళనకు గురి చేశారని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే వారిద్దరూ అక్కడి నుంచి పారిపోవడం తాను గమనించినట్లు తెలిపారు. ఆ తర్వాత తన కారులో చూడగా.. ఫోన్ కనిపించలేదని పేర్కొన్నారు. దీంతో ఆ ఇద్దరు దుండగులు తన గోల్డెన్ ఐఫోన్ 14 ప్రోను ఎత్తుకెళ్లేందుకు ఈ హైడ్రామా ఆడినట్లు తాను గ్రహించానని వెల్లడించారు. తన లంచ్ బాక్స్ ఉన్న బ్యాగులో ఆ సెల్‌ఫోన్ ఉందని.. దాన్ని వారు చోరీ చేసినట్లు తెలిపారు.

పట్టపగలే ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై ఇద్దరు దుండగులు ఇలా చేయడంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు కొన్ని నెలలుగా పనిచేయడం లేదని పోలీసులు తెలిపారు. అయితే తన ఐఫోన్ ఎక్కడ ఉంది అని ఆమె ఫైండ్ మై ఫోన్ యాప్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. ఆ ఫోన్‌ను తర్వాతి రోజు మీరట్‌లో దుండగులు స్విచ్ ఆన్ చేసినట్లు తెలిపారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T14:58:52Z dg43tfdfdgfd