TS EAPCET - 2024: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ పరీక్షలు ప్రారంభం, పరీక్షలకు 2.93 లక్షల విద్యార్థులు

TS EAPCET 2024 Engineering Exams: తెలంగాణలో ఎప్‌సెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నేడు (మే 9న) ప్రారంభమయ్యాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 9 నుంచి 11 వరకు ఎప్‌సెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మొదటి సెషన్‌లో, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఫలితాలను మే నెలాఖరులో విడుదల చేయనున్నారు. ఎప్‌సెట్‌ పరీక్షల్లో తొలిసారిగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. పరీక్ష కోసం మొత్తం 166 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు మొత్తం 2.93 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 2.05 లక్షల మంది, ఏపీ నుంచి 88 వేల మంది అభ్యర్థులు ఉన్నారు. 

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

ఎప్‌సెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగానే వారికి కేటాయించిన సెంటర్లకు చేరుకోవాలి. పరీక్షరాసే హాల్‌లోకి 90 నిమిషాల ముందు నుంచే అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. లేకపోతే చివరి నిమిషంలో పరీక్షాకేంద్రంలోకి వచ్చే విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పరీక్ష హాల్‌లోకి వెళ్లిన తర్వాత వెరిఫికేషన్‌, బయోమెట్రిక్‌, కంప్యూటర్‌ అలాట్‌మెంట్‌కు కనీసం 20 నిమిషాలు పడుతుంది. దీంతో చివరి నిమిషంలో వచ్చేవారు ఈ సమయాన్ని నష్టపోతారు. ఇలాంటి వారికి ఎలాంటి అదనపు సమయాన్ని కూడా ఇవ్వరు. కాబట్టి వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చూసుకోవాలి. 

పరీక్ష విధానం..

మొత్తం 160 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్/ బయాలజీ నుంచి 80 ప్రశ్నలు- 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు అయిన మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ/ఇంగ్లిష్‌ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. 

మే 11న అగ్రి-ఫార్మసీ ప్రాథమిక కీ విడుదల

ఎప్‌సెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం పరీక్షల రెస్పాన్స్‌షీట్లు, మాస్టర్‌ ప్రశ్నపత్రం, ప్రాథమిక ‘కీ’లను మే 11న విడుదల చేయనున్నారు. ఆన్సర్ కీపై మే 13న ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్‌ షీట్లు అందుబాటులో ఉంచనున్నారు.

విద్యార్థులకు ముఖ్య సూచనలు..

➥ ఈసారి పరీక్షల్లో తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలుచేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులో జతచేసిన ఫొటోను, అభ్యర్థి ముఖంతో సరిపోల్చి లోపలికి అనుమతిస్తామన్నారు.

➥ పరీక్ష సమయానికి 90 నిమిషాల ముందు నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.  

➥ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను పరీక్ష హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డు లేదా కాలేజీ ఐడీ కార్డును పరీక్ష రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ గుర్తింపుతోపాటు.. బయోమెట్రిక్ విధానంలో ఫోటో, కుడిచేతి వేలిముద్ర ద్వారా సరిపోల్చి లోపలికి అనుమతిస్తారు. 

➥ అభ్యర్థులు హాల్‌‌టికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు పత్రంతోపాటు ఒక ఫోటో, బ్లాక్ లేదా బ్లూ పెన్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

➥ పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ సమక్షంలో విద్యార్థులు హాల్‌టికెట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.

➥  సెల్‌ఫోన్ సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 

➥ వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరీక్ష కేంద్రంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.

➥ అభ్యర్థులు తమ చేతులపై గోరింటాకు, పచ్చబొట్లు ఉంటే అనుమతించరు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

2024-05-09T04:47:26Z dg43tfdfdgfd