YOGI ADITYANATH: యోగి ఎన్నికల సభలో బుల్డోజర్ల బ్రేక్ డ్యాన్స్

Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పేరు చెబితేనే బుల్డోజర్లు గుర్తుకువస్తాయి. ఆ రాష్ట్రంలో నిందితుల ఇళ్లను కూల్చేందుకు బుల్డోజర్లు ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే యూపీలో బుల్డోజర్ రాజ్య్ నడుస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే తాజాగా యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో బుల్డోజర్లతో డ్యాన్స్‌లు చేయించారు. అది చూసిన స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని వారిని వారించడంతో బుల్డోజర్ డ్యాన్స్‌లను ఆపేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న అలీగంజ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

అలీగంజ్‌లోని డావ్‌ ఇంటర్‌ కాలేజీ గ్రౌండ్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. అయితే యోగి ఆదిత్యనాథ్ సభాస్థలికి చేరుకోక ముందు బీజేపీ కార్యకర్తలు డజన్ల కొద్దీ బుల్‌డోజర్లను కాలేజీ గ్రౌండ్‌కు తీసుకువచ్చారు. అనంతరం డీజే పాటలు పెట్టగా.. వాటికి అనుగుణంగా బుల్డోజర్ డ్రైవర్లు వాటితో విన్యాసాలు చేశారు. ఇక కొందరు బీజేపీ కార్యకర్తలు అయితే ఆ బుల్డోజర్లు ఎక్కి మరీ కేరింతలు కొట్టారు. దీంతో పక్కన జరిగే ఎన్నికల సభను కాకుండా.. అక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు.. ఈ బుల్డోజర్ల షోను చూసేందుకే ఎక్కువ ఆసక్తి కనబరిచారు.

దీంతో బుల్డోజర్లు బ్రేక్ డ్యాన్స్‌లు చేయడాన్ని గమనించిన స్థానిక ఎమ్మెల్యే సత్యపాల్‌ సింగ్‌ రాథోడ్‌ రంగంలోకి దిగి వాటన్నింటిని ఆపేశారు. బుల్డోజర్ విన్యాసాలను ఆపాలని వాటి డ్రైవర్లకు సూచించారు. ఎమ్మెల్యే చెప్పినా బుల్డోజర్ డ్రైవర్లు వినకుండా అలాగే చేయడంతో.. సత్యపాల్ సింగ్ రాథోడ్‌కు బాగా కోపం వచ్చింది. ఇలా భారీగా జనం వచ్చిన సమయంలో బుల్డోజర్లతో స్టంట్లు చేస్తే ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని మందలించారు. ఇక బుల్డోజర్లతో విన్యాసాలు చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ఈ బుల్డోజర్ల డ్యాన్సులు ఆగిపోయిన కొద్దిసేపటి తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ సభాస్థలికి చేరుకుని ప్రసంగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరస్థులు, దేశ వ్యతిరేక శక్తులను తొక్కిపట్టి ఉంచడానికి బుల్డోజర్లను రకరకాల పద్ధతుల్లో వాడుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలు ప్రజల రక్షణను విస్మరించి ప్రవర్తిస్తున్నాయని యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల జేబుల నుంచి దోచుకోవడానికి కాంగ్రెస్, ఎస్పీ జట్టుకట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. అయోధ్య రామమందిరాన్ని వ్యతిరేకించే కూటమి ఇండియా కూటమి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-09T18:32:18Z dg43tfdfdgfd