YS JAGAN: శత్రు సైన్యాన్ని ఓడించేందుకు ఉత్తరాంధ్ర సిద్ధం- సీఎం జగన్‌ మాస్‌ స్పీచ్‌

AP CM YS Jagan Speech In Chelluru Sabha: విజయనగరం జిల్లా చెల్లూరులో నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్‌ ప్రతిపక్షాలపై అదిరిపోయే పంచ్‌లు విసిరారు. లక్షలాది మంది తాండ్ర పాపారాయుళ్లు మాదిరిగా శత్రుసైన్యాన్ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సీఎం జగన్‌ మాస్‌ డైలాగ్స్‌ పేల్చారు. శత్రు సైన్యాన్ని ఓడించేందుకు మీరంతా సిద్ధమైతే.. ఆ యుద్ధం ఎలా ఉంటుందో రుచి చూపించడానికి ఉత్తరాంధ్ర సిద్ధం సిద్ధం అంటూ అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికలు కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేను ఎన్నుకోవడానికి మాత్రమే కాదని, ఈ ఎన్నికలు ప్రతి ఇంటి భవిష్యత్‌ను మార్చేవన్నారు. తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్‌ను, పిల్లల భవిష్యత్‌ను, రాబోయే ఐదేళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించే ఎన్నికలన్నారు. దీనికి అడ్డు తగులుతున్న పెత్తందారుల మీద, ఆ కౌరవ సైన్యం, నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం సిద్ధం అంటూ అడుగులు వేస్తున్న ప్రజా సైన్యం తనకు కనిపిస్తోందన్నారు. చంద్రబాబు వెనుక కాంగ్రెస్‌ పార్టీ ఉందని, బీజేపీ ఉందని, ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా మద్ధతు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు తోడుగా దత్తపుత్రుడు కూడా ఉన్నాడని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 ఉన్నాయని, ఇవి చాలవన్నట్టుగా కుట్రలు, మోసాలు, అబద్ధాలు ఉన్నాయన్నారు. ఇవన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయని సీఎం జగన్‌ విమర్శించారు. 

తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముందన్న సీఎం

జగన్‌ ఐదేళ్లలో ప్రతి ఇంటికీ మంచి చేసి ఉండకపోతే.. ప్రతి ఇంట్లో జగన్‌ను బిడ్డగా, తమ్ముడిగా భావించకపోతే.. ఇంత మంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. జగన్‌ ఒకే ఒక్కడు కాదని, తనకున్నది కోట్లాది మంది ప్రజలు అని ఈ సందర్భంగా జగన్‌ పేర్కొన్నారు. 58 నెలల పాలనలో ఇంటింటికీ చేసిన మంచిపై తనకు నమ్మకముందని, ఆపైన దేవుడు దయ కూడా ఉందన్నారు. ప్రతివర్గానికి మేలు చేశామని, న్యాయం చేశామని జగన్‌ పేర్కొన్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నామని, పేదలను ఓడించాలని వాళ్లు చూస్తుంటే.. ఇంటింటికీ అభివృద్ధిని కొనసాగించాలని మనం కోరుకుంటున్నామని జగన్‌ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా..? అని జగన్‌ ప్రశ్నించారు.

ప్రజల కలలను మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు, ఆ కూటమికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. వస్తువులు ఎత్తుకుపోతే దొంగల ముఠా అంటామని, బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటామన్నారు. ఎన్నికలప్పుడు మోసం చేసి, మోసపూరిత హామీలు ఇచ్చే చరిత్ర కలిగిన మూడు పార్టీల కూటమిని ఏమనాలని జగన్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అటువంటి వారిని 420 అందామా..? అని జగన్‌ పార్టీ కేడర్‌ను ప్రశ్నించారు. 

పేదలకు అండగా 40 పథకాలు

నిరుపేదలకు అండగా 40 పథకాలను ప్రవేశపెట్టినట్టు సీఎం జగన్‌ పేర్కొన్నారు. నిరుపేదల కలలను పూర్తి చేసేందుకు 130 సార్లు బటన్‌ నొక్కానని జగన్‌ వెల్లడించారు. ఏకంగా రెండు లక్షల 70 వేల కోట్లు రూపాయలను ప్రజలకు నేరుగా అందించానన్నారు. పేదరికం కారణంగా పిల్లలను బడులకు పంపలేని స్థితిని పాదయాత్రలో చూశానని, అందుకే జగనన్న అమ్మ ఒడిని ప్రవేశపెట్టానన్నారు. పిల్లల గొప్ప భవిష్యత్‌కు కలలు కనే వారి గురించి తాను పాదయాత్రలో చూసినట్టు జగన్‌ పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదువుతున్న 93 శాతం మందికి విద్యా, వసతి దీవెనలో భాగంగా లబ్ధి చేకూరుస్తున్నట్టు పేర్కొన్నారు.

చంద్రబాబు అంటే చంద్రముఖి అని, అందుకే ప్రజలు గురించి పట్టించుకోడని సీఎం జగన్‌ విమర్శించారు. ప్రతి అక్క, చెల్లెమ్మకు ఆత్మగౌరవడంతో కల ఉంటుందని, అటువంటి కలలను నిజం చేసేందుకు అనేక పథకాలను అమలు చేసినట్టు జగన్‌ పేర్కొన్నారు. డ్రీమ్స్‌ పేదింటి అమ్మవి అయితే.. స్కీమ్స్‌ మీ బిడ్డవి అని గర్వంగా చెబుతానని జగన్‌ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో స్కీమ్స్‌ లేవన్నారు. అక్క, చెల్లమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలను జగన్‌ ఇచ్చాడని, 21 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయిందని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలను గుర్తించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం, పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్‌, పెట్టుబడి సాయంగా రైతు భరోసా, సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ, రూ.65 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. పొలాల్లో పెట్టే దిష్టి బొమ్మనైనా నమ్మవచ్చు కానీ, చంద్రబాబును నమ్మలేమన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో రంగురంగుల మేనిఫెస్టోను చంద్రబాబు తెస్తారని, ఎన్నికల అయిపోయిన తరువాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడన్నారు. నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 

2024-04-23T19:48:08Z dg43tfdfdgfd