YSRCP NEWS STRATEGY: ప్రత్యర్థి పేర్లతో బరిలో ఇండిపెండెంట్లు- ప్రధాన పార్టీ అభ్యర్థులకు కొత్త చికాకులు

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఈ ఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందులో భాగంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్‌గా చూస్తున్నాయి. వైసీపీ(YSRCP), ఉమ్మడి కూటమి పార్టీలు ప్రతీ ఓటును అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. ఇరు పార్టీలు ఎవరి వ్యూహాల్లో వాళ్లు నిమగ్నమవుతున్నారు. ఇలాంటి సమయంలో రూల్స్‌లో ఉన్న లూప్‌లను పట్టుకొని ప్రత్యర్థులను చికాకు పెట్టిస్తున్నారు.

తలనొప్పిగా మారిన పేర్లు 

ప్రత్యర్థుల పేర్లను పోలిన పేర్లు కలిగిన ఇండిపెండెంట్లపై ఫోకస్ చేస్తున్నాయి. అలాంటి వారిని వెతికి పట్టుకుని వచ్చి నామినేషన్లు వేయించడం అన్ని పార్టీలకు సమస్యగా మారుతోంది. ముఖ్యంగా కూటమి అభ్యర్థులకు పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. ఈ వ్యూహంలో వెనుకడుగులో ఉన్న కూటమి మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్ని ఆపలేరంటూ చెప్పుకొస్తోంది. అధికారం కూడా కూటమి ప్రభుత్వానిదే అంటోంది.

ఏ నియోజకవర్గంలో ఉన్నా వెతికి మరీ పట్టుకుని..

ప్రత్యర్ధి పేరును పోలిన పేర్లు.. లేదా అదే పేరు ఉంటే ఎంతమందిచేతనైనా ఇండిపెండెంట్లుగానో లేక ఏదైనా పార్టీల నుంచైనా కానో ఏదోలా నామినేషన్లు వేయించ గలిగింది వైసీపీ. కూటమి అభ్యర్థులు ఖరారు అయిన మరుక్షణం నుంచి ఇదే వ్యూహంలో నిమగ్నమై ఆ పార్టీ... ప్రత్యర్థి పేరును పోలిన పేరు, లేదా అదే పేరుతో ఉన్న వ్యక్తులను వెతికి మరీ పట్టుకుని వారితో నామినేషన్‌ వేయించారన్నది కూటమి అభ్యర్థుల ఆరోపణ. ఇదిలా ఉంటే ఈ తరహా నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులకు డమ్మీ నామినేషన్లు కూడా అదే పేరున పోలినవారు ఉండడం, వారిని ప్రపోజల్‌ చేసిన వారు వైసీపీకి చెందిన వారు ఉండడం గమనార్హం..

ఒక్క అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉదాహరణ..

అమలాపురం(Amalapuram)లో వైసీపీ తరపున పినిపే విశ్వరూప్‌(Pinipe Viswarupu), ఉమ్మడి కూటమి తరపున అయితాబత్తుల ఆనందరావు అభ్యర్థులుగా ఉండగా వీరిద్దరు నామినేషన్లు వేశారు. వీరితోపాటు కాంగ్రెస్‌ తరపున అయితాబత్తుల సుభాషిణి, బీఎస్పీ తరపున పొలమూరి మోహన్‌, ఇతరులు మరో ఆరుగురు నామినేషన్లు వేశారు. ఇందులో కూటమి అభ్యర్ధి అయితాబత్తుల ఆనందరావు పేరులాగానే మరో అభ్యర్ధి ఉన్నారు. ఆయన పేరు అయితాబత్తుల ఆనందరావు, మండపేట నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అద్దంకివారిపాలెం వాసి ఈయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ఈయనకు మద్దతు దారులుగా సంతకాలు పెట్టినవారంతా మంత్రి విశ్వరూప్‌కు అనుచరులే. మరొక స్వతంత్య్ర అభ్యర్ధి పేరు అయితాబత్తుల ఆనందబాబు, ఈయన అల్లవరం మండలం దేవగుప్తం ప్రాంతం వాసి. ఈయనకు మద్దతుదారులుగా సంతకాలు పెట్టిన వారంతా వైసీపీ నాయకులే. మరో అభ్యర్ధి పేరు అయితాబత్తుల అభిమన్యుడు. కూటమి అభ్యర్ధి ఆనందరావు గ్రామమే ఈయనది కూడా. ఈయనకు మద్దతుదారులుగా వైసీపీ నాయకులు మద్దతు సంతకాలు పెట్టారు. ఇలా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ప్రత్యర్ధి పేరును పోలిన పేరుతో ఉన్న స్వతంత్రులుగా నామినేషన్లు వేయించి ఆపై ఎన్నో కొన్ని ఓట్లు పక్కదారిపట్టిస్తే లాభం ఉంటుందని వైసీపీ కుట్రలు పన్నుతుందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు..   

2024-04-27T05:05:44Z dg43tfdfdgfd